భారత బలగాలపై చైనా రాళ్ల దాడి

20 Aug, 2017 07:22 IST|Sakshi
ఇండో-చైనా బోర్డర్‌లో సైనికుడు(ఫైల్‌)

- సంప్రదాయ భేటీకి డ్రాగన్‌ దూరం
- లడఖ్‌లో రాళ్లదాడికి పాల్పడిన డ్రాగన్‌

న్యూఢిల్లీ:
జాతీయ పండుగల సందర్భంగా సరిహద్దుల వద్ద భారత్‌, చైనాలు ఏటా ప్రత్యేకంగా భేటీ అవుతూఉంటాయి. మొత్తం ఐదు చోట్ల ఇరుదేశాల సైనికాధికారులు కలుసుకుని మాట్లాడుకోవడం, అభినందనలు తెలుపుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ ఈసారి చైనా ఆ సంప్రదాయ భేటీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

మీటింగ్‌కు రావాల్సిందిగా మంగళవారం భారత బలగాలు.. చైనా అధికారులకు ఫోన్‌ చేసినప్పటికీ అటు నుంచి స్పందన రాలేదు. పైగా, అదే సమయంలో డ్రాగన్‌.. భారత జవాన్లపై రాళ్ల దాడికి పాల్పడటం మరింత ఉద్రిక్తతకు కారణమైంది.

జమ్మూ కశ్మీర్‌ లడఖ్‌ ప్రాంతంలో ప్యాంగ్యాంగ్‌ సరస్సుకు భారత్‌ వైపు ఉన్న ఒడ్డున.. ఫింగర్‌ ఫోర్, ఫింగర్‌ ఫైవ్‌ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం చైనా చొరబాటుకు ప్రయత్నించిందని, భారత బలగాలు అప్రమత్తమై చొరబాటును తిప్పికొట్టాయని, అనంతరం చైనా బలగాలు మానవహారంగా ఏర్పడి రాళ్ల దాడికి పాల్పడ్డాయని భారత అధికారులు ప్రకటించారు.  అయితే భారత బలగాల అప్రమత్తంగా ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని వారు తెలిపారు.

ఐదు చోట్ల జరగాల్సిన భేటీలు..: ఇరుదేశాల జాతీయ పండుల సందర్భంలో సరిహద్దు వెంబడి ఉన్న ఐదు ప్రాంతాల్లో భారత్‌-చైనా సైన్యాలు సమావేశం కావడం రివాజుగా వస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లోని దౌలత్‌ బేగ్‌, చుషూల్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబిథూ, బుమ్‌లా, సిక్కింలోని నాథూలా వద్ద ఈ భేటీలు జరుగుతాయి. భారత స్వాతంత్ర్యదినోత్సవం నాడు ఈ ఐదు ప్రాంతాల్లో ఏ ఒక్కచోటా సమావేశం జరగలేదని ఆర్మీ ప్రకటించింది.

అమెరికా మాట: భారత్‌-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను వారు మాత్రమే పరిష్కరించుకోగలరని అమెరికా పేర్కొంది. యూఎస్‌ స్టేడ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి హెయిథర్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ముఖాముఖి చర్చల ద్వారా భారత్‌-చైనాలు సమస్యను పరిష్కరించుకోగలవని, ఆమేరకు ఇరు దేశాలనూ తాము ప్రోత్సహిస్తున్నామని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు