'ఇస్లామాబాద్'పై భారత్ సంచలన నిర్ణయం

25 Jul, 2016 17:59 IST|Sakshi
'ఇస్లామాబాద్'పై భారత్ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కశ్మీర్ సమస్యను మళ్లీ రగిలించేందుకు పాకిస్థాన్ అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో ఉత్పన్నమైన పరిస్థితులను బూచిగా చూపుతూ అనేక కుట్రలకు తెరలేపింది. ఐక్యరాజ్య సమితిలో భారత్ పై హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు నుంచి హఫీజ్ సయీద్, సిరాజ్ అల్ హకూన్ లాంటి చెంచాలతో క్షేత్రస్థాయి 'కశ్మీర్ స్వాతంత్ర్య పోరాటం' చేయిస్తోంది.

ఈ క్రమంలోనే సిరాజ్ ఉల్ హకూన్ నేతృత్వంలోని జమాతే ఇస్లామి(జేఐ) సంస్థ భారత హై కమిషన్ కార్యాలయం(ఇస్లామాబాద్) ముట్టడికి పిలుపు నిచ్చింది. మరోవైపు హఫీజ్ కు చెందిన 'జమాత్ ఉల్ దవా' వైద్య బృందం ఒకటి ఇస్లామాబాద్ హై కమిషనర్ లో భారత వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో పాక్ రాజధానిలోని ఇండియన్ ఎంబసీ వద్ద ఉద్రక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్ లో 'నో స్కూల్ గోయింగ్ మిషన్'ను అమలు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఇండియన్ హైకమిషన్ లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులెవరూ తమ పిల్లలను పాక్ లోని స్కూళ్లకు పంపకూడదని హై కమిషనర్ గౌతమ్ బంబావతేకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పిల్లలను వెంటనే ఇండియాకు పంపాలని ఉద్యోగులకు సూచించింది. తీవ్ర పరిణామాలు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో తప్ప విదేశాల్లోని భారత హై కమిషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోదు. సోమవారం నాటి నిర్ణయం భారత్- పాక్ మధ్య బలహీనమవుతోన్న సంబంధాలకు పరాకాష్ట అని పరిశీలకులు భావిస్తున్నారు.

(ఇస్లామాబాద్ లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయం)

ఆదివారం రావల్పిండి నుంచి బయలుదేరిన జమాతే ఇస్లామి(జేఐ) భారీ ర్యాలీలో ఆ సంస్థకు చెందిన వేలాది మంది కార్యకర్తలు బస్సులు, బైకులులతో ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ కార్యాలయం వైపుకు కదులుతున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం ఇండియన్ కాన్సులేట్ చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి, భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాలేకాక వెయ్యిమంది పోలీసులనూ మోహరించింది. జమాతే సంస్థ వచ్చే వారం కశ్మీర్ సరిహద్దు వరకు ర్యాలీ నిర్వహించనుంది. జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ ఇప్పటికే లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు యాత్ర నిర్వహించి సంగతి తెలిసిందే.

కశ్మీర్ పై వరుసగా పేలుతున్న పాక్ కు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ఆదివారం ఘాటుగా సమాధానమిచ్చారు. 'కశ్మీర్ తన పాలనలోకి వస్తుందని పాక్ కలలు కంటోంది. అవి కల్లలేగానీ, ఎన్నటికీ నిజం కాబోదు'అని పరోక్షంగా నవాజ్ షరీఫ్ కు చురకలంటించారు సుష్మ. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తర్వాత చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు 46 మంది పౌరులు చనిపోయారు. దాదాపు 2వేల మంది గాయపడ్డారు. గడిచిన 16 రోజులుగా అక్కడి 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నాయి.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా