నేలమీద రూపాయి బిళ్ల.. రోదసి నుంచీ చూడొచ్చు!

7 Oct, 2014 00:32 IST|Sakshi

టోక్యో: నేలపై పడి ఉన్న రూపాయి బిళ్లను సైతం అంతరిక్షం నుంచి స్పష్టంగా చూపగలిగేంత శక్తిమంతమైన, అతిపెద్ద టెలిస్కోపును నిర్మించేందుకు భారత్, అమెరికా, చైనా, జపాన్, కెనడా దేశాలు నడుంబిగించాయి. ప్రస్తుతం ఉన్న జపాన్‌కు చెందిన  అతిపెద్ద టెలిస్కోపు సుబారు కన్నా 49 శాతం పెద్దగా ఉండే ఈ ‘థర్టీ మీటర్ టెలిస్కోపు(టీఎంటీ)’ని హవాయి దీవిలోని 4,012 మీటర్ల ఎత్తైన మౌనా కీ అగ్నిపర్వత శిఖరంపై ఏర్పాటు చేస్తున్నారు. టెలిస్కోపు నిర్మాణం ప్రారంభించేందుకుగాను ఈ ఐదు దేశాలకు చెందిన 100 మంది ఖగోళ శాస్త్రవేత్తలు మంగళవారం(నేడు) మౌనా కీపై ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారని ‘క్యోడో’ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ టెలిస్కోపు నిర్మాణానికి 140 కోట్ల డాలర్ల వ్యయం (రూ.8,618 కోట్లు) కానుండగా.. 25 శాతం ఖర్చును జపాన్ భరించనుంది.

 

2022 సంవత్సరం నాటికి నిర్మాణం పూర్తయ్యే ఈ టెలిస్కోపు 500 కి.మీ. దూరం నుంచి కూడా రూపాయి బిళ్లంత వస్తువులనూ చూపగలదు. టీఎంటీలో 72 సెం.మీ. సైజు ఉండే 492 షట్కోణీయ దర్పణాలను అమర్చనున్నారు. ఇది సుబారు కన్నా 13 రెట్లు శక్తిమంతంగా పనిచేస్తుంది. నక్షత్రాలను, గ్రహాలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడనుంది.

మరిన్ని వార్తలు