మనకూ ట్రంప్‌ ఉన్నాడు!

9 Feb, 2017 04:31 IST|Sakshi
మనకూ ట్రంప్‌ ఉన్నాడు!

- మోదీపై రాహుల్‌ ఫైర్‌
బులంద్‌షహర్‌: ‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఈ మధ్యే డొనాల్డ్‌ ట్రంప్‌ను అధ్యక్షడిగా ఎన్నుకున్నాయి. గెలిచిన తర్వాత ఆయన చేస్తోన్న పనులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. దురదృష్టవశాత్తూ ఇండియాలో రెండున్నర ఏళ్ల కిందటే నరేంద్ర మోదీ రూపంలోని ట్రంప్‌ అధికారం​ చేపట్టారు. అప్పటినుంచి ఆయన పేదలను కొడుతూ పెద్దల జేబులు నింపుతూనేఉన్నారు..’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖుంజా పట్టణంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. మోదీని ట్రంప్‌తో పోల్చుతూ విమర్శలు కురిపించారు.

నోట్ల రద్దు నిర్ణయంతో మోదీ రైతుల నడ్డివిరిచాడని, పేదల సొమ్మనంతా బ్యాంకుల్లోకి చేర్చి, అటునుంచి బడాబాబుల జేబుల్లోకి వెళ్లేలా చేశారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి అవసరమైన డబ్బుల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగారని, క్యూలైన్లలో కన్నుమూసిన వారికి కేంద్రం కనీసం ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించకపోవడం దారుణమని రాహుల్‌ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై మోదీ వ్యాఖ్యలను రాహుల్‌ ఖండించారు.

’మన్మోహన్‌ సింగ్‌ను ఏదో అనడం ద్వారా మోదీ విపక్షాన్ని తక్కువ చేశానని అనుకుంటున్నారేమో! కానీ, వాస్తవం ఏమిటంటే, అనుచిత వ్యాఖ్యలతో మోదీ తనను తానే కించపర్చుకున్నాడు’అని రాహుల్‌ మండిపడ్డారు. నోట్ల రద్దు అంశంపై బుధవారం రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్‌ను ఉద్దేశించి చేసిన ’రెయిన్‌ కోట్‌’ వ్యాఖ్యలపై తీవ్రస్థాయి దుమారం చెలరేగింది. మోదీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ డిమాండ్‌ చేశాయి.
(మన్మోహన్ పై మోదీ అనుచిత వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు