మోడీకి బ్రిటన్ పార్టీల ఆహ్వానం

14 Aug, 2013 01:43 IST|Sakshi
మోడీకి బ్రిటన్ పార్టీల ఆహ్వానం

లండన్: బ్రిటన్‌ను సందర్శించాల్సిందిగా బీజేపీ ఎన్నికల కమిటీ ప్రచార సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్ అధికార కన్సర్వేటివ్ పార్టీతోపాటు ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలు కూడా మోడీకి ఆహ్వానం పంపటంపై ఏకీభవించటం ఆరుదైన విషయమని చెబుతున్నారు. 2002లో గోద్రా అల్లర్ల అనంతరం నరేంద్రమోడీ తమ దేశానికి రాకుండా బ్రిటన్ పదేళ్ల పాటు బహిష్కరించిన విషయం తెలిసిందే. గతేడాది బ్రిటన్ తన దృ క్పథాన్ని మార్చుకుంది.
 
 భారత్‌లో యూకే దౌత్యాధికారి జేమ్స్ బెవాన్ గత ఏడాది అక్టోబర్‌లో 22న మోడీని కలిసి బ్రిటన్ రావాలని ఆహ్వానించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఐరోపా యూనియన్ కూడా మోడీని బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఢిల్లీలో ఆయనకు విందు ఇచ్చింది. తాజాగా బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా మోడీకి ఆహ్వానం పలికింది. లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఎంపీ బారీ గార్డినర్ ఈమేరకు గత వారం లేఖ పంపారు. ‘ఆధునిక భారత్ భవిష్యత్తు’ అనే అంశంపై దిగువ సభ(హౌస్ ఆఫ్ కామన్స్)లో ప్రసంగించాలని మోడీని కోరారు. కాగా, వెంటనే బ్రిటన్‌ను సందర్శించే యోచనేదీ మోడీకి లేదని అని గుజరాత్ సీఎం కార్యాలయం ప్రతినిధి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు