డబ్ల్యూటీఓ చరిత్రాత్మక ఒప్పందం

8 Dec, 2013 03:33 IST|Sakshi
డబ్ల్యూటీఓ చరిత్రాత్మక ఒప్పందం

బాలి చర్చలు సఫలం
భారత్ ‘ఆహార భద్రత’కు డబ్ల్యూటీఓ అంగీకారం
ప్రపంచ వాణిజ్యానికి అవరోధాల సడలింపే కీలకం
రూ. 61 లక్షల కోట్ల మేర పెరగనున్న వాణిజ్యం
భారత్‌కు ఇది చరిత్మ్రాత్మక నిర్ణయం: ఆనంద్‌శర్మ

 
 బాలి (ఇండోనేసియా): ఏళ్ల తరబడి వరుస వైఫల్యాల అనంతరం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)  ఎట్టకేలకు.. అంతర్జాతీయ వాణిజ్యంపై చరిత్రాత్మక ఒప్పందాన్ని ఖరారు చేసింది. పేదలకు సబ్సిడీ ధరలతో ఆహార ధాన్యాలు అందించే ఆహార భద్రత పథకానికి రక్షణ కల్పించాలన్న భారత్ వంటి దేశాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ.. 159 దేశాల మంత్రులు శనివారం ఉదయం బాలి ప్యాకేజీకి అంగీకారం తెలిపారు. దోహా చర్చలు మొదలైన తర్వాత కుదిరిన ఈ తొలి ఒప్పందం వల్ల ప్రపంచ వాణిజ్య రంగం రూ. 61 లక్షల కోట్ల (లక్ష కోట్ల డాలర్లు) మేర పెరుగుతుందని అంచనా. గత నాలుగు రోజులుగా సుదీర్ఘంగా సాగిన చర్చల్లో.. క్యూబా చివరి నిమిషంలో అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరో మూడు లాటిన్ అమెరికా దేశాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాయి.
 
 ఐదో రోజు శనివారం చర్చల్లో ఒప్పందం ఖరారైంది. ‘‘డబ్ల్యూటీవో తొమ్మిదో మంత్రిత్వ సదస్సు బాలి ప్యాకేజీని పూర్తిగా ఆమోదించింది. ఇది చరిత్రాత్మక విజయం. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని ఇండోనేసియా వాణిజ్య మంత్రి గీతావీర్‌జవాన్ సదస్సు ముగింపు సందర్భంగా ప్రకటించారు. కస్టమ్స్ విధివిధానాలను సరళం చేయటం, మరింత పారదర్శకంగా చేయటం ద్వారా వాణిజ్యానికి అవరోధాలను సడలించటం బాలి ఒప్పందంలో కీలకమైన అంశం. డబ్ల్యూటీఓ చర్చలు ప్రారంభమైనపుడు.. ఆహార భద్రత, సబ్సిడీ విషయంలో భారత్ కఠిన వైఖరి ప్రదర్శించటంతో ఈ చర్చలు కూడా విఫలమవుతాయనే అభిప్రాయం వ్యక్తమైంది.
 
 అయితే శుక్రవారం నాటి చర్చల్లో.. భారత్ వంటి దేశాలు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించటానికి, ప్రజలకు సబ్సిడీ ధరల్లో ఆహార ధాన్యాలను అందించటానికి, దానిపై ఎలాంటి జరిమానాలూ విధించకుండా ఉండటానికి డబ్ల్యూటీఓ అంగీకరించింది. దీంతో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఈ నిర్ణయం భారతదేశానికి చరిత్రాత్మకమైనదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్‌శర్మ అభివర్ణించారు. దోహా చర్చల పునరుద్ధరణ, పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, బాలి డిక్లరేషన్ సానుకూలమైన పరిణామమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పేద, ధనిక దేశాలకు సమాన అవకాశాలను కల్పించేందుకు విస్తృత ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని బాలి ఒప్పందం సజీవంగా ఉంచింది. బాలి చర్చలు విజయవంతమైనందుకు సహకరించిన సభ్య దేశాలకు, ఆతిథ్యమిచ్చిన ఇండొనేసియాకు డబ్ల్యూటీఓ డెరైక్టర్ జనరల్ రాబర్టో అజివెడో కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేం ప్రపంచాన్ని మళ్లీ డబ్ల్యూటీఓలోకి తెచ్చాం. చరిత్రలో మొదటిసారిగా డబ్ల్యూటీఓ విజయం సాధించింది’’ అని ఆయన పేర్కొన్నారు.
 
 ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాం: కిసాన్‌సభ
 న్యూఢిల్లీ: రైతులకు మద్దతు ధర అందించే, కోట్లాది మంది అన్నార్తులకు ఆహార భద్రత కల్పించే దేశపు సార్వభౌమాధికార హక్కును ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ఉల్లంఘిస్తోందని.. దానిని తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఎం అనుబంధ రైతు సంఘం అఖిల భారత కిసాన్‌సభ ప్రకటించింది. ఆహార భద్రత అవసరాల కోసం ప్రభుత్వం చేసే నిల్వలపై అసమానత్వం నిబంధనలతో కూడిన డబ్ల్యూటీఓ మంత్రిత్వ ప్రకటనను భారత ప్రభుత్వం.. రాష్ట్రాలతో, పార్లమెంటులో చర్చలేకుండా అంగీకరించి ఉండాల్సింది కాదని కిసాన్‌సభ శనివారం ఒక ప్రకటనలో తప్పుపట్టింది.

మరిన్ని వార్తలు