మయన్మార్‌కు అండగా ఉంటాం

20 Oct, 2016 03:34 IST|Sakshi
మయన్మార్‌కు అండగా ఉంటాం

సూచీకి భారత్ రెండో ఇల్లు: ప్రధాని మోదీ
 మోదీ, సూచీల మధ్య విస్తృత ద్వైపాక్షిక చర్చలు
 భద్రత, వాణిజ్య రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయం
 విద్యుత్, బ్యాంకింగ్, బీమా రంగాల్లో మూడు ఒప్పందాలు

 
 న్యూఢిల్లీ: మయన్మార్ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని భారత్ హామీనిచ్చింది. మయన్మార్ విదేశాంగమంత్రి అంగ్‌సాన్ సూచీ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రత, వాణిజ్యం వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. విద్యుత్, బ్యాంకింగ్, బీమా రంగాల్లో పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ముడిచమురు, సహజవాయువు, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య పరిరక్షణలో సహకరించుకోవాలని తీర్మానించాయి. మయన్మార్‌లో నేషనల్ లీగ్ అధికారం చేజిక్కించుకున్నాక సూచీ భారత్‌లో మొదటిసారి పర్యటించారు.
 
 మీరు భారత్‌కు కొత్త కాదు: ప్రధాని
 భేటీ సందర్భంగా సూచీని ఆహ్వానిస్తూ... భారత్ ఆమెకు రెండో ఇల్లని అభివర్ణించారు. ‘మయన్మార్‌తో భారత్ స్నేహపూర్వక సంబంధాలు పూర్తి సహకారం, సంఘీభావంతో కొనసాగుతాయి. మీరు భారత ప్రజలకు కొత్త కాదు. ఢిల్లీలో ప్రదేశాలు, వాతావరణం అన్నీ బాగా తెలుసు. మీ రెండో ఇల్లైన భారత్‌కు మరోసారి ఆహ్వానం పలుకుతున్నాం’ అంటూ ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురి మధ్య చర్చల సారాంశాన్ని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సూచీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సన్నిహిత, పొరుగు దేశాలు కావడంతో భారత్, మయన్మార్‌ల భద్రతా ప్రయోజనాలు పరస్పరం ఆధారపడ్డాయని ప్రధాని పేర్కొన్నారు. ‘సరిహద్దు వెంట భద్రత పర్యవేక్షణలో సన్నిహిత సహకారం అందించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. వ్యూహాత్మక అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా నిర్ణయించాయి. ‘అది ఇరు దేశాలకు మంచి చేస్తుంది. వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ రంగాల్లో వ్యాపారాల్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాం’ అని ప్రధాని తెలిపారు.
 
 మన వనరులు, నైపుణ్యం మయన్మార్‌తో పంచుకుంటాం
 సూచీ స్పష్టమైన దూరదృష్టి, పరిణతిగల నాయకత్వం, మయన్మార్లో ప్రజాస్వామ్యం నెలకొనేందుకు చేసిన పోరాటం, విజయం ప్రపంచంలోని ప్రజలందరినీ ఉత్తేజితం చేసిందంటూ మోదీ కొనియాడారు. ‘సూచీ భారత్‌కు రావడం గౌరవంగా భావిస్తున్నాం, బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు’ అని ప్రధాని తెలిపారు. మయన్మార్‌లోని కొత్త ప్రభుత్వం దక్షిణాసియాను, నైరుతి ఆసియాతో అనుసంధానం చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని మోదీ చెప్పారు. ఆ దేశానికి దాదాపు రూ.11,900 కోట్ల అభివృద్ధి సాయం చేస్తున్నట్లు తెలిపారు.
 
 కాలాదాన్, మూడు దేశాల గుండా సాగే హైవేతో పాటు, మానవ వనరుల అభివృద్ధి రంగం, ఆహార పరిరక్షణ, శిక్షణ, నైపుణ్యం పెంపు ప్రాజెక్టుల్లో భారత్ వనరులు, నైపుణ్యాన్ని మయన్మార్‌తో పంచుకుంటామన్నారు. మణిపూర్‌లోని మోరెహ్ నుంచి మయన్మార్‌లోని టముకు విద్యుత్ సరఫరాకు హామీనిచ్చామని, అలాగే ఎల్‌ఈడీ విద్యుదీకరణ ప్రాజెక్టుకు కూడా సాయం చేస్తామని మోదీ వెల్లడించారు. పప్పుదినుసుల వ్యాపారంలో పరస్పర ప్రయోజన విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. ఇటీవల భూకంపంతో దెబ్బతిన్న పగోడాల మరమ్మతుకు సాయం చేస్తామని కూడా హామీనిచ్చారు.
 
 ప్రజాస్వామ్య విస్తరణలో భారత్ సాయం: సూచీ
 మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమం మహాత్మాగాంధీ, నెహ్రూల నుంచి పొందిందని సూచీ పేర్కొన్నారు. భారత్‌లోని భిన్నత్వం, బహుళత్వాన్ని  కొనియాడారు. ద్వైపాక్షిక సంబంధాల విస్తృతి కోసం మోదీ, తాను విస్తృత చర్చలు జరిపామన్నారు. ‘ నా పర్యటన ఇరు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహబంధాన్ని, నమ్మకాన్ని స్పష్టం చేసింది. భారత్ పర్యటన ఆనందాన్ని, పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఒకరిపై ఒకరు ఆధారపడి మరింత సన్నిహితంగా కలసి ముందుకు సాగాలనేది ఇరు దేశాల అభిమతం. మయన్మార్‌లో కింది స్థాయి వరకూ ప్రజాస్వామ్య సంస్కృతిని తీసుకెళ్లే ప్రయత్నంలో భారత్ సాయం చేస్తుందని నమ్ముతున్నాం. నిర్మాణ రంగం, ఇంధనం, సంస్కృతి, విద్యా రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకోనున్నాయి.
 
 నమ్మకంతో మయన్మార్‌లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలను కోరాను.అభివృద్ధి, రాజకీయాల విషయంలో భారత్ కంటే మయన్మార్ వెనుకబడింది. కొన్ని దశాబ్దాల క్రితం మయన్మార్ చాలా దక్షిణాసియా దేశాల కంటే ముందంజలోనే ఉండేది. మంచి స్నేహితుల సాయం, నిబద్ధతతో మళ్లీ కోలుకుంటామన్న నమ్మకంతో ఉన్నాం. మయన్మార్‌లో శాంతి, స్థిరత్వం తీసుకురావడమే తన లక్ష్యం’ అని సూచీ చెప్పారు.  భారత్‌లోని భిన్నత్వం, సమాఖ్య వ్యవస్థ మయన్మార్‌కు స్ఫూర్తిగా పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు