ఎగుమతులు తగ్గినా... లోటు ఓకే

12 Dec, 2013 02:12 IST|Sakshi
ఎగుమతులు తగ్గినా... లోటు ఓకే

న్యూఢిల్లీ: భారత ఎగుమతుల వృద్ధి 2013 నవంబర్ నెలలో కొంత నిరాశను మిగిల్చింది. 2012 ఇదే నెలతో పోల్చితే వృద్ధి రేటు కేవలం 5.86 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది 24.61 బిలియన్ డాలర్లు. ఎగుమతులు ఇంత తక్కువ స్థాయిలో జరగడం ఐదు నెలల్లో ఇదే తొలిసారి. 2012 నవంబర్‌లో ఈ విలువ 23.25 బిలియన్ డాలర్లు. 2013 అక్టోబర్‌లో 27.27 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతుల విషయానికి వస్తే- 16.3 శాతం తగ్గాయి (2012 నవంబర్‌తో పోల్చితే). విలువ రూపంలో ఈ పరిమాణం 33.83 బిలియన్ డాలర్లు (2011 మార్చి తరువాత ఇంత తక్కువ స్థాయి దిగుమతుల పరిమాణం నమోదు ఇదే తొలిసారి). 2012 ఇదే నెలలో ఈ పరిమాణం 40.54 బిలియన్ డాలర్లు. దీనితో ఎగుమతులు-దిగుమతులు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు నవంబర్‌లో 9.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సెప్టెంబర్‌లో 6.7 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు, మళ్లీ సింగిల్‌లో ఉండడం 2013-14లో ఇది రెండవసారి.
 
 ఎగుమతులు ఎందుకు తగ్గాయ్...
 పెట్రోలియం ఉత్పత్తులు, రఫ్ డైమండ్స్-ఆభరణాలు-రత్నాలు, ఔషధాల ఎగుమతులు తగ్గడంతో మొత్తంగా వృద్ధి రేటుపై ప్రతికూలత చూపిందని బుధవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా వాణిజ్య కార్యదర్శి ఎస్‌ఆర్ రావు వెల్లడించారు. ఆయా అంశాల గురించి రావు వివరిస్తూ, రఫ్ డెమైండ్స్ ధరల్లో పెరుగుదల వల్ల ఈ గ్రూప్ మొత్తం ఎగుమతులపై ప్రభావం చూపినట్లు తెలిపారు. నిర్వాహణా పరమైన సమస్యల  కారణంగా రెండు రిఫైనరీలు పనిచేయకపోవడం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని దేశీయ నియంత్రణల వల్ల ఫార్మా ఎగుమతులు తగ్గాయని రావు తెలిపారు.
 
 8 నెలల్లో ఇలా...
 కాగా 2013-14 తొలి 8 నెలల కాలంలో (ఏప్రిల్-నవంబర్) ఎగుమతులు 6.27 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ పరిమాణం 191.95 బిలియన్ డాలర్ల నుంచి 203.98 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇది దిగుమతుల్లో అసలు పెరుగుదల లేకపోగా, ఇవి 5.39 శాతం క్షీణించాయి. అంటే గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ విలువ 321.19 బిలియన్ డాలర్ల నుంచి 303.89 డాలర్లకు తగ్గాయి. దీనితో వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. 2013-14లో ఈ లోటు191 బిలియన్ డాలర్లు.
 
 బంగారం, వెండి ఎఫెక్ట్
 బంగారం, వెండి దిగుమతులు తగ్గడం మొత్తం వాణిజ్యలోటుపై సానుకూల ప్రభావం చూపిందని రావు పేర్కొన్నారు.  కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నవంబర్‌లో బంగారం, వెండి దిగుమతులు 80.49శాతం పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలలో 5.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ విలువ 2013 నవంబర్‌లో 1.05 బిలియన్ డాలర్లకు చేరింది. చమురు దిగుమతులు సైతం 1.1 శాతం పడిపోయి 12.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ విలువ మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తాం. రూపాయి క్షీణతకు ప్రధాన కారణాల్లో ఒకటైన ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులను కట్టడి చేసింది. దీనితో ఈ దిగుమతులు జూన్ నుంచీ భారీగా తగ్గుతూ వచ్చాయి. ఫలితం వాణిజ్యలోటు తగ్గుదలపై తద్వారా క్యాడ్ కట్టడిపై ప్రభావం చూపుతూ వచ్చింది. కాగా ఢిల్లీలో జరిగిన ఒక ఆర్థిక సదస్సులో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చీఫ్ సీ రంగరాజన్ మాట్లాడుతూ, ఏడాదికి 30 బిలియన్ డాలర్ల వరకూ బంగారం దిగుమతులు భారత్‌కు తగిన స్థాయని వివరించారు.
 

మరిన్ని వార్తలు