కొనటం లేదు.. అమ్మేస్తున్నారు..!

30 Aug, 2013 01:55 IST|Sakshi
కొనటం లేదు.. అమ్మేస్తున్నారు..!
పసిడి ధర పెరగటంతో కస్టమర్ల రివర్స్ గేర్  నగదు కావాలంటూ షాపులకు క్యూ
 దుకాణాల్లో పడిపోయిన నగల అమ్మకాలు  బిజినెస్ లేక మూసేయటానికీ కొందరు రెడీ!
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరోబంగారం ఇపుడు వర్తకులకే కాదు. సామాన్యులకూ వ్యాపార వస్తువైపోయింది. నిన్నమొన్నటి వరకూ మోజుపడి పసిడి కొనుగోలు చేసిన సగటు జీవి.. బంగారం ధర కనీవినీ ఎరుగనిరీతిలో కొండెక్కడంతో కొనటం కన్నా అమ్మటానికి ఆసక్తి చూపిస్తున్నాడు. దాచుకున్నది కూడా బయటకు తీస్తున్నాడు. 
 
 ముడి బంగారం కొరతతో వర్తకులు కూడా పాత బంగారం కొనేందుకు సై అంటున్నారు. ఇంకేముంది దుకాణాల్లో పాత బంగారం, నగలు అమ్మేవారి సందడే ఎక్కువైంది. మరోవంక ఆభరణాల అమ్మకాలు చాలా దుకాణాల్లో పడిపోయాయి. ముడి బంగారం దొరక్క, ఆభరణాలు కొనేవారు లేక వర్తకులు బిక్కమొహం వేస్తున్నారు. బిజినెస్ మూసేస్తే బెటరని కొందరు అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 
 
 అమ్మేవారే ఎక్కువ..
 పసిడి ధర పెరగడంతో చాలా ఆభరణాల అమ్మకాలు ఏ మాత్రం జరగటం లేదు. కొన్ని ప్రముఖ దుకాణాల్లో మాత్రం మునుపటితో పోలిస్తే 10 శాతం దాకా అమ్మకాలు జరుగుతున్నాయి. పాత బంగారం, నగలు అమ్మి నగదు తీసుకువెళ్లే కస్టమర్లే ఎక్కువయ్యారని వర్తకులు అంటున్నారు. ఒక కస్టమర్ 400 గ్రాముల బంగారాన్ని తమకు విక్రయించారని అమీర్‌పేటలోని ఆర్‌ఎస్ బ్రదర్స్ జ్యుయలరీ విభాగం మేనేజర్ నాగ కిరణ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. పాత బంగారం అమ్మడం సాధారణమేనని, అయితే ఈ సీజన్‌లో ఇంత మొత్తంలో లావాదేవీ జరగడం తమ షాపులో ఇదే ప్రథమమని చెప్పారు. బంగారం ధర పెరగటంతో 60 శాతం లావాదేవీలు ఇలాంటివే ఉంటున్నాయన్నారు. వాస్తవానికి పాత బంగారం 20 శాతం అవసరాలు మాత్రమే తీరుస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 
 
 అప్పుడు కొని..
 ఈ ఏడాది ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం ధర రిటైల్‌లో 10 గ్రాములు రూ.33 వేలకు అటూఇటుగా నమోదైంది. జూన్‌లో బాగా క్షీణించి రూ.25 వేల సమీపానికి వచ్చింది. దీంతో చాలామంది ఆ సమయంలో అప్పులు చేసి మరీ బంగారాన్ని కొన్నారు. ఒకదశలో దుకాణాల ముందు కస్టమర్లు క్యూలో నిల్చున్న సందర్భాలూ ఉన్నాయి. అప్పుడు తక్కువ ధరకు బంగారం కొన్నవారిలో అత్యధికులు ఇప్పుడు అమ్మేస్తున్నారని సీఎంఆర్ సిల్క్స్, జ్యువెల్స్ ఎండీ సత్తిబాబు చెప్పారు. జూన్‌లో రికార్డు స్థాయిలో ఆభరణాల అమ్మకాలు నమోదైతే, ఇప్పుడు అమ్మకాలు పూర్తిగా పడిపోవడమూ రికార్డేనని తెలియజేశారు.
 
  సాధారణ రోజుల్లో సీఎంఆర్ గ్రూప్‌కు చెందిన ఆరు ఔట్‌లెట్లలో రోజుకు సగటున రూ.1 కోటి వ్యాపారం జరిగేదని, ఇప్పుడు సగానికి పడిందని చెప్పారాయన. వజ్రాలు, విలువైన రత్నాలతో చేసిన నగలు మాత్రం అమ్ముడవుతున్నాయని చెప్పారు. కాగా, గురువారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.31,600, 22 క్యారెట్లు రూ.31,500 ఉంది. బుధవారం ముంబై బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర రూ.33,430కి చేరి కొత్త రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
 14 క్యారెట్ల నిబంధన రావాలి..
 దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతం  ఆభరణాల రూపంలో ఎగుమతి చేయాలన్న రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిబంధన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా మారింది. ‘దీనికితోడు 20 శాతం బంగారాన్ని కస్టమ్స్ అధికారుల వద్ద గ్యారంటీగా పెట్టాలని చెప్పారు. కానీ ఎక్కడ, ఎలా నిల్వ చేయాలో స్పష్టత లేదు. దీంతో గత నెల రోజులుగా దేశంలోకి ముడి బంగారం దిగుమతులు అసలే లేవు’ అని ఆంధ్రప్రదేశ్ బులియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.మహాబలేశ్వర రావు చెప్పారు. 
 
 14 క్యారెట్ల ఆభరణాలను మాత్రమే దేశంలో తయారు చేయాలన్న నిబంధన ఉండాలని, అలా చేస్తే బంగారం దిగుమతులు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. యూరప్, అమెరికా, జపాన్‌లో 14 క్యారెట్ల బంగారు ఆభరణాలు విరివిగా వినియోగిస్తారని తెలియజేశారు. ప్రస్తుతం దేశం నుంచి 8 శాతం లోపే ఆభరణాల ఎగుమతులు జరుగుతున్నాయి. వాటిని 20 శాతానికి చేర్చడం సాధ్యం కాదని జీజేఎఫ్ డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు సాగక దుకాణాలు మూసివేసేందుకు కొందరు సిద్ధపడుతున్నారని కూడా ఆయన  పేర్కొన్నారు. 
 
మరిన్ని వార్తలు