పసిడి కొనుగోళ్లకు బ్యాంకులూ రెడీ

30 Aug, 2013 02:34 IST|Sakshi
పసిడి కొనుగోళ్లకు బ్యాంకులూ రెడీ
ముంబై: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు, పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులో భాగంగా ముందు ప్రజల దగ్గర నిరుపయోగంగా ఉంటున్న పసిడిని బైటికి తీసుకురావడంపై దృష్టి సారించింది.. ఇలా వచ్చిన బంగారాన్ని దేశీ డిమాండ్‌కి తగ్గట్లుగా అందుబాటులోకి తేవడం, తద్వారా దిగుమతులు తగ్గించుకోవడంపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సాధారణ ప్రజానీకం నుంచి కూడా బంగారం కొనుగోలు చేసేలా బ్యాంకులను అనుమతించే అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోంది. 
 
 దేశీయంగా ప్రజానీకం వద్ద 1.4 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసేంతగా 31,000 టన్నుల బంగారం ఉందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 557.7 టన్నుల మేర పసిడి నిల్వలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు భారత్ ఏటా భారీ స్థాయిలో పసిడిని దిగుమతి చేసుకుంటోంది. గతేడాది సుమారు 860 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇలా పసిడి, చమురు దిగుమతులతో కరెంటు అకౌంటు లోటు (క్యాడ్- దేశంలోకి వచ్చే, వెళ్లే విదేశీ నిధుల మధ్య వ్యత్యాసం) కొండంతగా పెరిగిపోతూ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. చెల్లింపుల కోసం డాలర్లు తరలిపోతుంటే .. రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతూ ఆందోళన కలిగిస్తోంది. చమురు దిగుమతులను ఎలాగూ ఆపే పరిస్థితి లేకపోవడంతో.. కనీసం పసిడి దిగుమతులనైనా నిలువరించి రూపాయి పతనానికి బ్రేక్ వేయాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. 
 
 ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కనీసం 500 టన్నుల బంగారాన్నైనా నగదు రూపంలోకి  మార్చుకోగలిగితే క్యాడ్‌ని భర్తీ చేసుకోవచ్చని వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. అలాగని.. బంగారం అమ్మాలని గానీ, తాకట్టు పెట్టాలని గానీ తాను ఆర్‌బీఐకి చెబుతున్నట్లు భావించరాదంటూ ఆయన స్పష్టం చేసినప్పటికీ .. రిజర్వ్ బ్యాంక్ మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ప్రజల దగ్గర్నుంచి పసిడి కొనుగోలు చేసేలా బ్యాంకులను ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.
 
 ముందుగా కొన్ని బ్యాంకులతో దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మంగా పరీక్షించాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆభరణాలు, కడ్డీలు, నాణేలను కొనుగోలు చేయాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించనున్నట్లు వివరించాయి. ప్రస్తుతం దీనిపై బ్యాంకులతో చర్చలు జరుపుతోందని, త్వరలోనే దీన్ని ప్రవేశపెట్టే అవకాశముందని తెలిపాయి. అమ్మకందారులు ఇతరత్రా వ్యాపారస్తుల దగ్గరకి వెళ్లకుండా తమవైపు తిప్పుకోవాలంటే బ్యాంకులు అధిక రేటు ఇవ్వాల్సి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. 
 
>
మరిన్ని వార్తలు