సరిహద్దులో శాంతి!

13 Sep, 2015 00:43 IST|Sakshi
సరిహద్దులో శాంతి!

మోర్టార్ షెల్స్ ప్రయోగంపై నిషేధానికి భారత్, పాక్ అంగీకారం
 
న్యూఢిల్లీ: సరిహద్దులో తిరిగి శాంతి స్థాపన దిశగా భారత్, పాకిస్తాన్‌లు కీలక చర్యలు చేపట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి మోర్టార్ దాడులపై పూర్తి నిషేధం విధించాలని నిర్ణయించాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలు, సీమాంతర చొరబాట్లు తదితర సున్నిత అంశాలను ఉమ్మడిగా పరిష్కరించుకునేందుకు వాటిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి.

శనివారం ఢిల్లీలో ముగిసిన మూడు రోజుల చర్చల్లో బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ దేవేంద్ర కుమార్ పాఠక్, పాక్ రేంజర్స్ డెరైక్టర్ జనరల్(పంజాబ్) మేజర్ జనరల్ ఉమర్ ఫరూఖ్ బుర్కీ ఈ మేరకు 20 సూత్రాల ఉమ్మడి చర్చల రికార్డుపై సంతకాలు చేశారు. కాగా, చిట్టచివర పరిస్థితుల్లో మాత్రమే భారీ ఆయుధాలను వినియోగించాలని కూడా ఇరు దేశాలు అంగీకరించినట్లు  సమాచారం. సరిహద్దులో కొన్ని నెలలుగా మోర్టార్ షెల్స్ ప్రయోగం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరగడం తెలిసిందే. కాగా, మోదీ భారత ప్రధాని అయ్యాక సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనలు పెరిగిపోయాయని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్   అన్నారు.
 

>
మరిన్ని వార్తలు