ఎఫ్‌డీఐలకు తలుపులు బార్లా

17 Jul, 2013 02:07 IST|Sakshi
ఎఫ్‌డీఐలకు తలుపులు బార్లా

న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చే దిశగా కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. బీమా, రక్షణ రంగాలతో పాటు పన్నెండు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టెలికంలో ఎఫ్‌డీఐలను 100 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో రక్షణ, ఆర్థిక, చమురు, విద్యుత్, హోం, ఆహార శాఖల మంత్రులు పాల్గొన్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. పౌర విమానయానం, ఎయిర్‌పోర్టు, మీడియా, మల్టి బ్రాండ్ రిటైల్, బ్రౌన్‌ఫీల్డ్ (ప్రస్తుతమున్న) ఫార్మా సంస్థల్లో ఎఫ్‌డీఐ పరిమితులను పెంచే అంశాలు ఈ సమావేశంలో చ ర్చకు రాలేదు.
 
 జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.8 శాతానికి, 2012-13 ఆర్థిక సంవత్సరంలో దశాబ్దపు కనిష్ట స్థాయి అయిన 5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మయారాం కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 20 రంగాల్లో పెట్టుబడుల పరిమితులను సడలించాలంటూ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ.. 12 రంగాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మల్టి బ్రాండ్ రిటైల్, పౌర విమానయానం తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచిన పది నెలల తర్వాత ఈ రెండో విడత సంస్కరణలను ప్రభుత్వం చేపట్టింది. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటం నేపథ్యంలో తనకున్న పరిమిత సమయంలో కేంద్రం హడావుడిగా సంస్కరణల బాట పట్టింది.
 పెట్టుబడులు, ఉపాధికి ఊతం..
 
 అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పెట్టుబడులు, ఉపాధి కల్పన, వృద్ధికి దోహదపడగలవని ఆనంద్ శర్మ వివరించారు. వీటికి సంబంధించి తక్షణమే కేబినెట్ నోట్ రూపొందించడం జరుగుతుందని, వచ్చే సమావేశంలో కేబినెట్ ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర లభించవచ్చని వివరించారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితి యథాతథంగా 26 శాతంగానే ఉంటుందని, అయితే.. ‘అత్యాధునిక’ టెక్నాలజీ తయారీలో మాత్రం పరిమితిని పెంచడాన్ని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిశీలిస్తుందని శర్మ తెలిపారు. ఈ ‘అత్యాధునిక’ అన్న పదానికి రక్షణ శాఖ తగు నిర్వచనాన్ని ఇస్తుందన్నారు. ఎఫ్‌డీఐలు ఉన్న కంపెనీల్లో యాజమాన్య, నియంత్రణ అధికారాల అంశాలకు సంబంధించి త్వరలో కేబినెట్ నోట్ రూపొందించనున్నట్లు ఆనంద్ శర్మ తెలిపారు. దీన్ని ఆర్థిక మంత్రితో చర్చించానని, ఒక ఫార్ములాపై ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన చెప్పారు. మొత్తం మీద మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ నిర్ణయాలు దోహదపడగలవని శర్మ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయాలతో మరిన్ని విదేశీ పెట్టుబడులు రాగలవన్నారు.
 
 బీమాలో 49 శాతానికి పెంపు..
 
 వివాదాస్పదమైన బీమా రంగంలో ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ పద్ధతిలో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. దీని వల్ల ఇన్వెస్ట్ చేసే కంపెనీలు ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోనక్కర్లేదు. ఈ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితులను పెంచే బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. మరోవైపు, సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐల విధానంలో సవరణలు చేశారు. వీటి ప్రకారం ఈ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతిస్తారు. అంతకు మించితే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మల్టీ బ్రాండ్ రిటైల్‌కి సంబంధించి త్వరలోనే మరింత స్పష్టత రాగలదని శర్మ తెలిపారు.
 
 చమురు సంస్థల్లో 49 శాతం దాకా ఆటోమేటిక్ పద్ధతి..
 
 ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, కమోడిటీ ఎక్స్చేంజీలు, పవర్ ఎక్స్చేంజీలు, స్టాక్ ఎక్స్చేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లలో ఆటోమేటిక్ పద్ధతిలో 49 శాతం దాకా ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ప్రస్తుతం ఇందుకు ఎఫ్‌ఐపీబీ అనుమతి కావాల్సి ఉంటోంది. ఇక టెలికం రంగానికి సంబంధించి .. బేసిక్, సెల్యులార్ సర్వీసుల్లో ఎఫ్‌డీఐ పరిమితులను ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. ఇందులో 49 శాతం పెట్టుబడులను ఆటోమేటిక్ పద్ధతి ద్వారాను, మిగతాది ఎఫ్‌ఐపీబీ అనుమతుల ద్వారాను అనుమతిస్తారు. అటు కొరియర్ సర్వీసుల్లో 100 శాతం పెట్టుబడులను ఎఫ్‌ఐపీబీ మార్గం ద్వారా కాకుండా ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతించనున్నారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థల్లో ఆటోమేటిక్ పద్ధతిన 74 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తారు.
 
 ఎఫ్‌డీఐ హైలైట్స్
 

  •  టెలికంలో పరిమితి 74% నుంచి 100%కు పెంపు. 49% వరకూ పెట్టుబడులను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. ఈ పరిమితి దాటితే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) నుంచి అనుమతి పొందాలి.
  •  పౌర విమానయానంలో పరిమితిని యథాతథంగా 49% వద్దే ఉంచారు.
  •   రక్షణ ఉత్పత్తుల విభాగంలో 26% పరిమితిని కొనసాగించేందుకు నిర్ణయించారు. ఇంతకుమించిన పెట్టుబడులను సీసీఎస్‌కు సంబంధించిన అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పరిగణిస్తారు.
  •   సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100% ఎఫ్‌డీఐలకు ఓకే. 49% పెట్టుబడులకు ఆటోమేటిక్ రూట్‌కాగా, ఆపై ఎఫ్‌ఐపీబీ అనుమతించాలి.
  •   బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 26% నుంచి 49%కు పెంచారు. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది.
  •   పెట్రోలియం శుద్ధి(రిఫైనింగ్) రంగంలో 49% వరకూ పెట్టుబడులకు ఆటోమేటిక్ మార్గంలో అనుమతి. గతంలో ఇందుకు ప్రభుత్వ అనుమతులను తీసుకోవాల్సి వచ్చేది.
  •   పవర్ ఎక్స్ఛేంజీలలో 49% వరకూ పెట్టుబడులకు ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. ఇంతక్రితం ఎఫ్‌ఐపీబీ అనుమతించాల్సి ఉండేది.
  •   ఆస్తుల పునర్‌నిర్వచన (అసెట్ రీకన్‌స్ట్రక్షన్) కంపెనీలలో విదేశీ పెట్టుబడుల పరిమితి 74% నుంచి 100%కు పెంపు. దీనిలో 49% వరకూ ఆటోమాటిక్ రూట్‌లో అనుమతిస్తారు.
  •   క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలలో ఎఫ్‌డీఐ పరిమితిని 49% నుంచి 74%కు పెంచారు.
  •   స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలలో 49% వరకూ ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్‌లో అనుమతిస్తారు.
  •   కొరియర్ సర్వీసుల విభాగంలో ఆటోమేటిక్ మార్గం ద్వారా 100% ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు.
  •   టీ తోటల విభాగంలో 49% వరకూ పెట్టుబడులను ఆటోమాటిక్ రూట్‌లో అనుమతిస్తారు. ఆపై 100% వ రకూ పెట్టుబడులకు ఎఫ్‌ఐపీబీ అనుమతి తప్పనిసరి.
  •   విమానాశ్రయాలు, మీడియా, ఫార్మా యూనిట్ల కొనుగోలు(బ్రౌన్ ఫీల్డ్ ఫార్మా), మల్టీబ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐల పరిమితిపై నిర్ణయాలు తీసుకోలేదు.

మరిన్ని వార్తలు