నియంత్రణ అడ్డంకులు తొలగాలి

25 Nov, 2013 00:31 IST|Sakshi
నియంత్రణ అడ్డంకులు తొలగాలి

న్యూయార్క్: వృద్ధి పథంలో మరింత దూసుకెళ్లే సత్తా భారత్‌కు ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ వృద్ధి పరుగులు తీయాలంటే ప్రభుత్వం నియంత్రణపరమైన అడ్డంకులను తొలగించడం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే రూపొందించిన ‘రీఇమేజినింగ్ ఇండియా: అన్‌లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఏషియా నెక్స్ట్ సూపర్‌పవర్’ అనే పుస్తకంలో ‘మేకింగ్ ద నెక్స్ట్ లీప్’ అనే పేరుతో అంబానీ ఒక వ్యాసాన్ని రాశారు. ‘రానున్న కాలంలో భారత్‌కు వృద్ధి రేటు ప్రస్థానంలో మరింత దూసుకుపోయే సామర్థ్యం ఉందని నా విశ్వాసం.
 
 దీనికి అండగా, భారత్ సమగ్రమైన, విప్లవాత్మకమైన చర్యలను చేపట్టడం చాలా ముఖ్యం. ఏదోనామమాత్రపు చర్యలతో సరిపెడితే కుదరదు. దేశంలో ఇంకా ఆర్థిక సాధికారతకు దూరంగా ఉన్న కోట్లాదిమంది ప్రజలకు ఈ ఫలాలను అందించడం, అదేవిధంగా యువతకు మరిన్ని ఉద్యోగాలను కల్పించాలంటే ప్రజలు, ప్రభుత్వ, వ్యాపార రంగం కలిసికట్టుగా పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముకేశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
 యువతే మనకు అండ...
 2030 కల్లా చైనాను వెనక్కినెట్టి జనాభాలో అగ్రస్థానానికి భారత్ చేరే అవకాశం ఉందని, అయితే యువ భారత్ మనకు అత్యంత కలిసొచ్చే అంశమని చెప్పారు. దాదాపు మూడింట రెండొతుల మంది జనాభా 35 ఏళ్లలోపే ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు