డిజిటల్ ఎకానమీలో భారత్ వెనుకంజ!

7 Jul, 2016 17:58 IST|Sakshi

డిజిటైజ్ ఎకానమీలో భారత్ రెండు స్థానాలు కోల్పోయిందట. 2015లో 89వ ర్యాంకును దక్కించుకున్న భారత్, ప్రస్తుతం 91వ ర్యాంకును నమోదు చేసింది. దీంతో గ్లోబల్ డిజిటల్ ఎకానమీలో భారత్ ఇంకా వెనుకంజలోనే ఉన్నట్టు తెలిసింది. జెనీవాకు చెందిన వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ నేడు  విడుదల చేసిన వార్షిక నెట్ వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో భారత్ రెండు స్థానాలను కోల్పోయింది.

ఈ జాబితాలో మరోసారి సింగపూరే అగ్రస్థానంలో నిలిచింది. ఫిన్ లాండ్ రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే, భారత ర్యాంకు తక్కువగా నమోదైంది. రష్యా 41వ ర్యాంకును, చైనా మూడు స్థానాలను మెరుగుపరుచుకుని 59వ ర్యాంకును, దక్షిణాఫ్రికా 65వ స్థానం, బ్రెజిల్ 72వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. స్వీడన్, నార్వే, అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూకే, లక్సంబార్గ్, జపాన్ లు టాప్-టెన్ స్థానాల్లో నిలిచాయి.


గ్లోబల్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్టు ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ ఈ ర్యాంకులను విడుదల చేస్తుంది. మొత్తం 139 దేశాలతో ఈ రిపోర్టు ర్యాంకులను విడుదలచేసింది. వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ ర్యాంకింగ్ లో భారత్ పడిపోయింది. భారతదేశం 2013లో 68వ, 2014లో 83వ, 2015లో 89వ, 2016లో 91వ ర్యాంకులను నమోదుచేసింది. మౌలిక సదుపాయాల లేమి, తక్కువ నైపుణ్యాలు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్వీకరణకు అడ్డంకులుగా మారుతున్నాయని డబ్ల్యూఈఎఫ్ ఇండెక్స్ పేర్కొంది. భారత జనాభాలో మూడోవంతు ఇంకా డిజిటల్ నిరక్షరాస్యులుగా ఉన్నారని రిపోర్టు తెలిపింది.

100 ఇళ్లకు గాను కేవలం 15 మాత్రమే ఇంటర్నెట్, మొబైల్ యాక్సెస్ ను కలిగి ఉన్నాయని, ప్రతి 100 మంది ప్రజల్లో 5.5 మాత్రమే సబ్ స్క్రిప్షన్ నమోదవుతుందని వెల్లడించింది. ఇవన్నీ డిజిటల్ ఎకానమీలో భారత్ స్థానాన్ని తగ్గిస్తున్నాయని తెలిపింది. 2015లో కేంద్ర ప్రభుత్వం, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ తో డిజిటల్ లిటరసీని పెంపొందించడంతో పాటు, ప్రజలకు ఆన్ లైన్ సర్వీసులను మెరుగుపర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు