పాక్ రాయబారికి నిరసన తెలిపిన ప్రభుత్వం

7 Aug, 2013 04:39 IST|Sakshi

న్యూఢిల్లీ: పాక్ చర్యపై మండిపడిన ప్రభుత్వం.. భారత్‌లోని పాక్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌ను పిలిపించి తమ నిరసనను వ్యక్తంచేసింది. సౌత్ బ్లాక్‌లోని విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి రుద్రేంద్ర టాండన్.. ఖాన్‌ను పిలిపించి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతీస్తాయని హెచ్చరించారు. కాగా దాడి నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ బుధవారం పూంచ్‌కు వెళ్లనున్నారని సైనిక వర్గాలు తెలిపాయి. అలాగే సైనిక వ్యవహారాల డీజీ లెఫ్టినెంట్ జనరల్ వినోద్‌భాటియా.. పాకిస్థాన్ సైనిక వ్యవహారాల డీజీతో మాట్లాడి ఘటనపై నిరసన వ్యక్తం చేస్తారని వివరించాయి.
 
 దౌత్య చర్చలపై నీలినీడలు
 ఈ ఏడాది జనవరిలో ఇద్దరు భారత సైనికుల్ని పాక్ సైన్యం దారుణంగా చంపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల చర్చల పునరుద్ధరణకు పాక్ ప్రతిపాదించింది. భారత్ తన స్పందన తెలపాల్సిందిగా కోరింది. అలాగే వచ్చే నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో భారత్, పాక్ ప్రధానులు మన్మోహన్ సింగ్, నవాజ్ షరీఫ్ న్యూయార్క్‌లో భేటీ కావాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ప్రస్తుత ఘటన చర్చల పునరుద్ధరణకు ఆటంకంగా మారనుంది.

>
మరిన్ని వార్తలు