పాక్‌పై భారత్‌ మరో దౌత్యదాడి!

27 Sep, 2016 18:19 IST|Sakshi
పాక్‌పై భారత్‌ మరో దౌత్యదాడి!
  • అబ్దుల్‌ బాసిత్‌కు సమన్లు
  • ఉడీ దాడిపై ఆధారాలు అందజేత

  • న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌పై భారత్‌ తన దౌత్య దాడిని తీవ్రతరం చేసింది. ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌కు మంగళవారం సమన్లు జారీచేసింది. అంతేకాకుండా ఉడీ దాడిలో పాకిస్థాన్‌ హస్తాన్ని నిరూపించే ఆధారాలను అబ్దుల్‌ బాసిత్‌కు అందించింది.

    ’విదేశాంగ కార్యదర్శి ఎస్‌ జైశంకర్‌ అబ్దుల్‌ బాసిత్‌ను పిలిపించి మాట్లాడారు. సరిహద్దుల్లో (పాక్‌ ఉగ్రవాదుల) చొరబాట్లకు సహకరించిన ఇద్దరు గైడ్లను స్థానిక గ్రామస్తులు పట్టుకున్నారని, వారు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారని బాసిత్‌కు తెలియజేశారు’అని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

    ’ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఉడీలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడిని హఫీజ్‌ అహ్మద్‌గా గుర్తించారు. అతను పాకిస్థాన్‌ ముజఫరాబాద్‌లోని దర్భాంగ్‌కు చెందిన ఫిరోజ్‌ కొడుకు అని తేలింది’ అని ఆయన తెలిపారు. ఉడీలో దాడికి దిగిన మరో ఇద్దరిని మహ్మద్‌ కబీర్‌ అవాన్‌, బషారత్‌గా గుర్తించినట్టు తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదులు దాడులు కొనసాగించడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని బాసిత్‌కు తేల్చి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.

    పాక్‌ రాయబారి బాసిత్‌కు భారత్‌ సమన్లు జారీచేయడం ఇది రెండోసారి. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సెప్టెంబర్‌ 21న కూడా ఆయనకు విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దౌత్యపరంగా అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని, ఆర్థికంగా, సైనికంగా దెబ్బకొట్టే వ్యూహాలు రచించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు