‘అగ్ని-1’ పరీక్ష విజయవంతం

9 Nov, 2013 03:11 IST|Sakshi

బాలాసోర్ (ఒడిశా): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని వీలర్ ఐల్యాండ్‌లో గల ఐటీఆర్ ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9:33 గంటలకు నిర్వహించిన ఈ పరీక్ష అన్ని రకాలుగా విజయవంతమైందని ఐటీఆర్ డెరైక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ వెల్లడించారు. సాధారణ వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు.
 
  మధ్యశ్రేణి రకానికి చెందిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి అణ్వస్త్రాలతో సహా వెయ్యి కిలోల పేలోడ్లను మోసుకుపోగలదు. సుమారు 700 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. పన్నెండు టన్నుల బరువు, 15 మీటర్ల పొడవైన అగ్ని-1లో అత్యాధునిక నావిగేషన్(దిశానిర్దేశ) వ్యవస్థను అమర్చారు. దీనిని హైదరాబాద్‌లోని ‘రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల, పరిశోధక కేంద్రం ఇమారత్’, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లతో కలిసి డీఆర్‌డీవో ప్రధాన ప్రయోగశాల అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ రూపొందించింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు