వచ్చే ఏడాది 8% వృద్ధి: ఫిచ్

23 Mar, 2015 02:27 IST|Sakshi

 భారత జీడీపీపై అంచనాలు
 7.8% ఉండొచ్చంటున్న హెచ్‌ఎస్‌బీసీ

 ముంబై: భారత ఆర్థిక వృద్ధి అంచనాల పట్ల వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆశావహంగా ఉన్నాయి. భారత జీడీపీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో  8 శాతంగానూ, 2016-17లో 8.3 శాతంగానూ ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేస్తోంది. బ్రిక్స్ దేశాల్లో భారత్ మాత్రమే వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని  ‘గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్’ నివేదికలో ఫిచ్ పేర్కొంది.
 
  జీడీపీ గణనకు ఆధార సంవత్సరాన్ని 2004-05కు బదులుగా కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ) 2011-12కు మార్చిన విషయం తెలిసిందే. వృద్ధి వేగవంతంగా ఉండే అవకాశాలున్నప్పటికీ, బ్యాంక్‌ల మొండి బకాయిలు పెరుగుతున్నాయని, కంపెనీల ఆర్థిక పరిస్థితులు బాగా లేవని, పెట్టుబడుల స్థాయిలు కనిష్ట స్థాయిలో ఉన్నాయని ఫిచ్ ఆందోళన వెలిబుచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న సంస్థాగత సంస్కరణలు, ద్రవ్య, పరపతి విధానాల్లో ఉదారత్వం భారత వృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడింది.  
 
 కాలం కలసివస్తోంది: హెచ్‌ఎస్‌బీసీ
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.4 శాతం వృద్ధిని సాధిస్తుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేసింది. భారత్‌కు కాలం కలసివస్తోందని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియా  ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి వ్యాఖ్యానించారు. సంస్కరణల జోరు, స్తంభించిన ప్రాజెక్టులను పునఃప్రారంభించడం, పెట్టుబడుల జోరు పెంచడం, ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు.. ఈ అంశాలన్నీ భారత వృద్ధికి చోదక శక్తులుగా పనిచేస్తాయన్నారు.
 

మరిన్ని వార్తలు