భవిష్యత్తు ఆశావహంగానే: క్రిసిల్

23 Jan, 2014 02:30 IST|Sakshi
భవిష్యత్తు ఆశావహంగానే: క్రిసిల్

న్యూఢిల్లీ: ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 4.8 శాతానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. అయితే, ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడొచ్చనే ఆశావహధోరణి నేపథ్యంలో... వచ్చే ఏడాది మాత్రం ఆర్థిక వ్యవస్థకు సానులకూల ధోరణి కనబడుతోందని పేర్కొంది. ‘2014-15లో వృద్ధి రేటు 6%గా ఉంటుందని భావిస్తున్నాం.

వర్షాలు బాగా కురవడంతో వృద్ధికి చేదోడుగా నిలవడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించడంలో దోహదపడనుంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయంగా ఆర్థిక రికవరీ వృద్ధి పెరుగుదలకు తోడ్పడే అంశాలు. అయితే, ఇవన్నీ గనుక ప్రభావం చూపకపోతే 5% దిగవకు కూడా పడిపోవచ్చు’ అని క్రిసిల్ తన నివేదిక(భారత్ ఆర్థిక అంచనాలు)లో వెల్లడించింది.

 నివేదికలో ముఖ్యాంశాలివీ...
     2014-15లో కొత్త నాయకత్వం, పాత సవాళ్లు అనే ధోరణి ఉంటుంది.
     ఎన్నికల ఫలితాలనుబట్టి మధ్యకాలికంగా చూస్తే వృద్ధి పెరుగుదల, తగ్గుదల రెండింటికీ అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రాజకీయ అనిశ్చితి ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది.


     ఫలితాలు ఏదో ఒక పార్టీ లేదా కూటమికి అనుకూలంగా వస్తే.. సంస్కరణలు మరింత ముందుకెళ్లడంతోపాటు విధానపరమైన అడ్డంకులూ తొలగుతాయి. హంగ్ గనుక ఖాయమైతే సంస్కరణలు కుంటుబడతాయి. దీంతో పెట్టుబడులకు సెంటిమెంట్ దెబ్బతినడమే కాకుండా వృద్ధి కూడా గాడితప్పుతుంది.

మరిన్ని వార్తలు