పాక్‌కు భారత్‌, అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

27 Jun, 2017 09:01 IST|Sakshi
పాక్‌కు భారత్‌, అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వాషింగ్టన్: దాయాది పాకిస్థాన్‌కు భారత్‌, అమెరికా ఉమ్మడిగా గట్టి సందేశాన్ని ఇచ్చాయి. తన భూభాగాన్ని వేదికగా చేసుకొని సీమాంతర ఉగ్రవాద దాడులు జరపకుండా పాకిస్థాన్‌ చర్యలు తీసుకోవాలని గట్టిగా సూచించాయి. 26/11 ముంబై దాడులు, పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడి సూత్రధారులను చట్టం ముందుకుతెచ్చి సత్వరమే శిక్షించాలని డిమాండ్‌ చేశాయి.

ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని, ఉగ్రవాదుల స్వర్గధామలాలను నిర్మూలిస్తామని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉమ్మడిగా ప్రతిన బూనారు. 'ఉగ్రవాద నిర్మూలనే మాకు అత్యంత ప్రాధాన్య విషయం' అని ట్రంప్‌తో కలిసి సంయుక్త ప్రకటన చేస్తూ మోదీ పేర్కొన్నారు. తన భూభాగం వేదికగా చేసుకొని ఇతర దేశాలపై ఉగ్రవాద దాడులు జరగకుండా పాక్‌ చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతల తమ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.

'మేం ఉగ్రవాదం, తీవ్రవాదం, అతివాదం గురించి చర్చించాం. ఈ విషయాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాం' అని మోదీ చెప్పారు. ఉగ్రవాద సంస్థలను, వాటిని నడిపించే భావజాలాన్ని ధ్వంసం చేయాలని ఇరుదేశాలూ నిశ్చయించినట్టు ట్రంప్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు