శాశ్వత స్థానానికి కట్టుబడి ఉన్నాం

24 Sep, 2015 02:22 IST|Sakshi
శాశ్వత స్థానానికి కట్టుబడి ఉన్నాం

భారత్‌కు భద్రతామండలి సభ్యత్వంపై మద్దతును పునరుద్ఘాటించిన అమెరికా
* ముగిసిన తొలి భారత్-అమెరికా వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు
*  ‘మిసైల్ టెక్నాలజీ కంట్రోల్’లో భారత్ ప్రవేశానికి అమెరికా మద్దతు 
* ప్రాజెక్ట్ టైగర్, భారతీయుల నైపుణ్యాభివృద్ధికి అమెరికా సాయం
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌ను శాశ్వత సభ్యదేశంగా చేర్చటానికి తాము కట్టుబడి ఉన్నామని అమెరికా పేర్కొంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్న నేపథ్యంలో..

ఇరు దేశాలూ తమ భద్రతా, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌లు అధ్యక్షతన వాషింగ్టన్‌లో జరిగిన ఇరుదేశాల తొలి వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు బుధవారం ముగిశాయి. అనంతరం ఇరు దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భద్రతామండలి సంస్కరణలకు, అందులో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వటానికి అమెరికా మద్దతిస్తోందని ఆ ప్రకటన పేర్కొంది.

ఐరాస చార్టర్‌లో ఆకాంక్షించిన విధంగా అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించటంలో భద్రతామండలి సమర్థవంతమైన పాత్రను పోషించటాన్ని కొనసాగించేలా చూడటానికి ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయని ఆ ప్రకటన ఉద్ఘాటించింది. హిందూ మహాసముద్రం, ఆసియా - పసిఫిక్ ప్రాంతాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగానూ శాంతి, సుస్థిరత, సుసంపన్నతలకు భారత్ - అమెరికా భాగస్వామ్యం గణనీయమైన తోడ్పాటునిస్తోందని వివరించింది. అమెరికా, భారత్, జపాన్‌లు తమ త్రైపాక్షిక భాగస్వామ్యాన్ని మంత్రిత్వ స్థాయికి పెంచాలని నిర్ణయించాయి.

దీనికి సంబంధించిన తొలి సమావేశం వచ్చే వారంలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరగనుంది. ఇంధనశక్తి భద్రత, వాతావరణ మార్పు, పరిశుభ్రమైన ఇంధనశక్తి అంశాలపై ఇరుదేశాలూ అవగాహ నా ఒప్పందాలను ఖరారు చేసినట్లు జాన్‌కెర్రీ పేర్కొన్నారు. లష్కరే తోయిబా, హక్కానీ నెట్‌వర్క్, డీ-కంపెనీ వంటి ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా సంయుక్త వైఖరికి ఇరు దేశాలూ కట్టుబడ్డాయని సుష్మా తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న ఇంకొన్ని నిర్ణయాలు...
 
* ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదు రెట్లు చేస్తూ 500 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.32 లక్షలకోట్లకు) పెంచాలని తీర్మానం.
* క్షిపణి సాంకేతిక నియంత్రణ విధానం (మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ - ఎంటీసీఆర్)లో భారత్ ప్రవేశానికి అమెరికా మద్దతు తెలిపింది. తద్వారా భారత్‌కు సాయుధ డ్రోన్ వంటి క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా అందించేందుకు వీలు కలగనుంది. రాబోయే ఎంటీసీఆర్ ప్లీనరీలో భారత్ సభ్యత్వానికి తమ మద్దతును ఉద్ఘాటిస్తున్నట్లు అమెరికా తెలిపింది.
* అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో వచ్చే నవంబర్‌లో ప్రాంతీయ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని భారత్ నిర్వహించనుంది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారత్ చేసిన ప్రకటనను అమెరికా ఆహ్వానించింది.
* బెంగాల్ పులుల జాడను గుర్తించి వాటిని సంరక్షించటం కోసం భారత్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ టైగర్’కు సాంకేతిక తోడ్పాటునందించటానికి అమెరికా ముందుకువచ్చింది. వన్యప్రాణి సంరక్షణకు, వన్యప్రాణుల అక్రమ తరలింపుపై పోరాటానికి ఇరు దేశాల సహకారాన్ని బలోపేతం చేసుకోవాలన్నాయి.  
* వచ్చే దశాబ్దంలో 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణనివ్వాలన్న లక్ష్యాన్ని భారత్ చేరుకునేందుకు విద్యా ప్రాజెక్టుల్లో సహకారమందిస్తామని అమెరికా ప్రకటించింది.

మరిన్ని వార్తలు