'2030నాటికి ప్రపంచాన్ని నడిపించేది ఇండియానే'

26 Oct, 2016 09:01 IST|Sakshi
'2030నాటికి ప్రపంచాన్ని నడిపించేది ఇండియానే'

రాయ్పూర్: 'మరో 14 ఏళ్లు.. అంటే 2030 నాటికి ఇండియా ప్రపంచాన్ని నడిపించే శక్తిగా మారడం ఖాయం. అప్పటికి ఇక్కడ జనాభా పెరుగుతుంది. నగరాలు, పట్టణాలు విస్తరిస్తాయి. మధ్యతరగతి వర్గం బలపడుతుంది. మౌళిక సదుపాయాలు కూడా మెరుగవుతాయి. గ్రాడ్యుయేట్లకు కొదువే ఉండదు. కొత్తకొత్త ఆవిష్కరణు పురుడుపోసుకుంటాయి. పేటెంట్ దక్కించుకునేవారి సంఖ్యా పెరుగుతుంది. ఇదే.. ఇదే కారణం వల్ల ప్రపంచదేశాలు ఇండియా పట్ల విపరీతమైన ఆసక్తిని, ఇండియాతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నాయి' అని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. మంగళవారం ఛత్తీస్గఢ్లో పర్యటించిన ఆయన రాయ్పూర్లో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.


దాదాపు అన్ని రంగాల్లో ఇండియా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని, ఆ మేరకు అమెరికా కూడా అపరిమితమైన సహకారాన్ని అందిస్తున్నదని రిచర్డ్ వర్మ చెప్పారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఇరుదేశాల మధ్య అన్ని రంగాల్లో బంధాలు మరింత పటిష్టం అయ్యాయని, వ్యాపారవాణిజ్యాలు 100 బిలియన్ డాలర్లకు చేరుకున్నదని తెలిపారు. 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారని, గతేడాది 11 లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళితే, అదే స్థాయిలో 10 లక్షల మంది అమెరికన్లు ఇండియాకు వచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇండియా సూపర్ పవర్ గా ఎదగాలని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తపించిపోతారని, ఇండియా పేరు విన్నప్పుడల్లా ఆయన ఉద్వేగానికి గురవుతారని వర్మ చెప్పుకొచ్చారు.

చరిత్రపొడవునా విడివిడిగా ప్రస్థానాన్ని సాగించిన అమెరికా- ఇండియాలు గడిచిన దశాబ్ధాలుగా సమాంతరంగా ప్రయాణిస్తున్నాయని, భవిష్యత్తులో అవి మరింత దగ్గరవుతాయని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆ పని ఇంకాస్త వేగంగా జరుగుతుందని  విశ్వసిస్తున్నట్లు వర్మ చెప్పారు. అంతకుముందు సీఎం రమణ్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులను కలుసుకున్న అమెరికా రాయబారి.. ఛత్తీస్ గఢ్ వ్యాపారానికి అత్యంత అనుకూల రాష్ట్రంగా ఎదిగినందుకు అభినందనలు తెలిపారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా