పీవోకేపై ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు!

1 Sep, 2016 18:09 IST|Sakshi
పీవోకేపై ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) విషయంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ సాహా అసాధారణరీతిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1971 యుద్ధం వరకు వైమానిక శక్తిని భారత్‌ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయిందని, పీవోకే విషయంలో ఆదర్శాల ప్రాతిపదికన కాకుండా సైనిక చర్యకు భారత్‌ దిగివుంటే, ఆ ప్రాంతం ఇప్పటికీ మన ఆధీనంలోనే ఉండేదని ఆయన పేర్కన్నారు.

ఇప్పుడు పీవోకే మన శరీరంలోకి దిగిన ముల్లులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత అవసరాల విషయంలో భారత్‌ ఎప్పుడూ ఆచరణాత్మక ధోరణిని అవలంబించలేదని పేర్కొన్నారు. భారత్‌లో భద్రతా వాతావరణం దుర్భరంగా ఉందని పేర్కొన్న ఆయన.. గగనతల వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఈ ప్రాంతంలో సంక్షోభాలను అధిగమించి, శాంతిభద్రతలను నెలకొల్పే అవకాశముంటుందని చెప్పారు.

'ఐరాస, అలీనోద్యమం, పంచశీల లక్ష్యాలకు అనుగుణంగా మన విదేశాంగ విధానం ఉంది. మనల్ని పెద్ద పెద ఆశయాలున్న నేతలు పాలించారు. భద్రతా అవసరాల విషయంలో మనం ఎప్పుడూ ఆచరణాత్మక వైఖరిని అవలంబించలేదు. ఆమేరకు సామరస్యమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో సైనిక శక్తిని మనం విస్మరించాం' అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సవాళ్లను, సంఘర్షణలను ఎదుర్కోవడంలో సైనిక శక్తి, ముఖ్యంగా వైమానిక శక్తిని వినియోగించుకోవడంలో భారత్‌ ఎప్పుడూ విముఖత చూపిస్తూ వస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు