భారతీయ అమెరికన్ విద్యార్థికి ప్రతిష్టాత్మక అవార్డు

4 Dec, 2013 13:06 IST|Sakshi
భారతీయ అమెరికన్ విద్యార్థికి ప్రతిష్టాత్మక అవార్డు

నానో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేసిన భారతీయ అమెరికన్ విద్యార్థి సౌమిల్ బంధోపాధ్యాయ(18)కు ప్రతిష్టాత్మక స్మిత్‌సోనియన్ మ్యాగ జైన్ ‘అమెరికన్ ఇంజెన్యూటీ అవార్డు’ లభించింది. ఆటోమొబైల్స్ మొదలుకొని ఖగోళశాస్త్రం వరకూ ఎంతో ఉపయోగపడనున్న ‘ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ డిటెక్టర్’ను ఆవిష్కరించినందుకుగాను సౌమిల్‌కు ఈ అవార్డు దక్కింది.

సౌమిల్‌తో సహా ఈ రెండో వార్షిక అమెరికన్ ఇంజెన్యూటీ అవార్డులకు 10 మంది ఎంపిక కాగా, వారికి గతనెలలో అవార్డుల ప్రదానం జరిగిందని ఈ మేరకు ‘స్మిత్‌సోనియన్ మ్యాగజైన్’ డిసెంబరు సంచికలో కథనం ప్రచురించింది. వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారుడు, మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో మొదటేడాది గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన సౌమిల్ అతిపిన్న వయసులోనే విశేష తెలివితేటలు (ఇంజెన్యూటీ) కనపర్చాడని పత్రిక ప్రశంసించింది.

కాగా పరారుణ కిరణ రేడియేషన్‌ను గుర్తించే ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ డిటెక్టర్లు పనిచేయాలంటే వాటిని ఖరీదైన ద్రవ నైట్రోజన్ ట్యాంకులతో చల్లబర్చాల్సి ఉంటుంది. కానీ సౌమిల్ కనుగొన్న డిటెక్టర్ మాత్రం గది ఉష్ణోగ్రతతో పనిచేయడం వల్ల చాలా చౌకగానే అందుబాటులోకి రానుంది. పొగమంచు, చీకటిలో కార్లు, ఇతర వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టకుండా కూడా ఈ డిటెక్టర్ ఉపయోగపడనుండటంతో వాహన ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు వీలుకానుంది. మందుపాతరలను గుర్తించేందుకు, భూతాపోన్నతి పర్యవేక్షణకు, నక్షత్రాల జననాన్ని పరిశీలించేందుకూ ఇది ఉపయోగపడనుంది. శాస్త్రీయ పరిశోధనలకు, సైన్యానికి, ప్రజలకూ ఉపయోగపడే ఈ డిటెక్టర్‌పై అమెరికా ఆర్మీ సైతం ఆసక్తి వ్యక్తంచే యడం విశేషం.
 

మరిన్ని వార్తలు