విజయ డెయిరీలో గ‘లీజు’ దందా!

20 Nov, 2015 03:48 IST|Sakshi
విజయ డెయిరీలో గ‘లీజు’ దందా!

సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీని వీధిలో నిలబెట్టేశారు. సంస్థను అడ్డుపెట్టుకొని ఎవరికివారు అందినకాడికి దోచుకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకం సొమ్ము పక్కదారి పట్టిన వైనం బయటపడి వారం గడవకముందే... విజయ డెయిరీలో మరో అక్రమం బయటపడింది.

రాష్ట్రంలోని విజయ డెయిరీ పార్లర్లలో ఎక్కువ భాగం ఒకే వ్యక్తికి కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. కొందరు అధికారులు అతనికే టెండర్లు దక్కేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా డెయిరీ పార్లర్ల దుకాణాలకు టెండర్లు దాఖలుకాగా.. ఆ వ్యక్తికే వచ్చేలా ఏర్పాట్లు జరిగాయని ప్రచారం జరుగుతోంది.
 
సబ్‌లీజులతో..
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పాల ఉత్పత్తులను రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. రైల్వే స్టేషన్లలోని దుకాణాల్లో కొన్నింటిని తక్కువ లీజు ధరకే పాలు, పాల పదార్థాల విక్రయాల కోసం కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఏడు రైల్వే స్టేషన్లలో విజయ డెయిరీకి తక్కువ లీజుతో దుకాణాలు దక్కాయి.

వీటితోపాటు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో విజయ డెయిరీ పార్లర్లను టెండర్ల ద్వారా వ్యాపారులకు కేటాయిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 విజయ డెయిరీ పార్లర్లు వెలిశాయి. అయితే మొత్తం డెయిరీ పార్లర్లలో దాదాపు 90 శాతం ఐదారేళ్లుగా ఒకే వ్యక్తి చేతుల్లో ఉన్నాయి.

కొన్ని నేరుగా, మరికొన్ని బినామీ పేరు మీద తీసుకొని వాటిని సబ్ లీజులకు ఇచ్చి నడిపిస్తున్నాడు. దీనిపై విమర్శలు రావడంతో చిన్నాచితక పార్లర్లను పక్కనపెట్టి ప్రస్తుతం 20 పెద్ద దుకాణాలను తన చేతుల్లో ఉంచుకున్నాడు. రైల్వే స్టేషన్లలోని ఏడు దుకాణాలూ అతని చేతుల్లోనే ఉన్నాయి.
 
దోపిడీ ఇలా..
సదరు వ్యక్తి డెయిరీ పార్లర్ల దుకాణాలను సబ్ లీజుకు ఇచ్చి లక్షలకు లక్షలు వసూలు చేసుకుంటున్నాడు. ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫాం వద్ద ఉన్న పార్లర్‌కు రైల్వే శాఖ నిర్ణయించిన నెల వారీ అద్దె రూ. 22,500. కానీ సదరు వ్యక్తి సబ్ లీజుదారు నుంచి నెలకు రూ. 3.30 లక్షలు వసూలు చేస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి అందిన ఫిర్యాదులో తేలింది.

అంటే రోజుకు రూ. 11 వేలు వసూలు చేస్తున్నారు. ఫ్లాట్‌ఫాం నంబర్ 10లో ఉన్న పార్లర్‌కు రైల్వే శాఖ నిర్ణయించిన నెలవారీ అద్దె రూ. 18,500 కాగా.. రూ. 1.35 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక వరంగల్ రైల్వేస్టేషన్‌లోని పార్లర్‌కు రైల్వే శాఖ అద్దె నెలకు రూ. 7,600 కాగా.. సబ్‌లీజుదారుల నుంచి రూ. 34,980, నాంపల్లి రైల్వేస్టేషన్‌లోని పార్లర్ అద్దె నెలకు రూ. 8,500 కాగా.. రూ. 75 వేలు వసూలు చేస్తున్నాడు.

ఇలా సబ్‌లీజుల ద్వారా రూ. కోట్లు కాజేస్తున్నాడు. ఇక పార్లర్ల ద్వారా వచ్చే ఆదాయం సరేసరి. అయితే లీజు సొమ్ములో కొంత భాగం విజయ డెయిరీకి ఇవ్వాలన్న నిబంధనను కూడా తుంగలో తొక్కారు. అధికారులు కూడా అతనికి మినహాయింపు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అక్రమాలతో విజయ డెయిరీ రూ. 4 కోట్ల వరకు కోల్పోయినట్లు అంచనా.
 
టెండర్ల నిలిపివేత
ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో రైల్వేస్టేషన్లలోని డెయిరీ పార్లర్లకు దాఖలైన టెండర్లను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తాత్కాలికంగా నిలిపేశారు. దీనిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవల పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సురేష్ చందా, ఎండీగా బాధ్యతలు తీసుకున్న నిర్మల విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు