శ్రీలంక కాల్పుల్లో భారత మత్స్యకారుడి మృతి

7 Mar, 2017 11:05 IST|Sakshi

చెన్నై: చేపల వేటకు వెళ్లిన తమిళనాడు మత్స్యకారుడిని శ్రీలంక సైన్యం పొట్టన పెట్టుకుంది. శ్రీలంక సైనికులు జరిపిన కాల్పుల్లో రామేశ్వరానికి చెందిన  బ్రిడ్గో (22) అనే యువకుడు మృతి చెందాడు. కచ్చతీపు ద్వీపాల్లో మరికొందరితో కలిసి మెకనైజ్డ్ బోటులో వేటకు వెళ్లిన బ్రిడ్గో తదితరులపై శ్రీలంక నేవీ కాల్పులు జరినట్లు మత్స్యకారులు ఆరోపించారు. వారు కాల్చిన తూటా సరిగ్గా బ్రిడ్గో మెడపై తగలడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసేవరకు బ్రిడ్గో మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని అతడి కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. సుమారు వెయ్యిమందికి పైగా స్థానికులు మృతుడి ఇంటి వద్ద చేరి.. ఆందోళనలు చేపట్టారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను డిమాండ్‌ చేశారు.

మరోవైపు ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు. కేంద్రం ఈ అంశంపై మౌన ప్రేక్షక పాత్ర పోషించకూడదని, ఇప్పటికైనా ఈ సమస్యను గట్టిగా పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు