నాకు నకిలీ పాస్‌పోర్టు ఇచ్చింది అధికారులే: రాజన్

8 Sep, 2016 15:57 IST|Sakshi
నాకు నకిలీ పాస్‌పోర్టు ఇచ్చింది అధికారులే: రాజన్

ఉగ్రవాదులపై పోరాడేందుకు వీలుగా భారత నిఘా వర్గాలే తనకు నకిలీ పాస్‌పోర్టు ఇప్పించాయని మాఫియా డాన్ ఛోటా రాజన్ కోర్టులో చెప్పాడు. బ్యాంకాక్‌లో 16 ఏళ్ల క్రితం నుంచి దావూద్ ఇబ్రహీం మనుషులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకే తనకు మోహన్ కుమార్ అనే పేరుతో పాస్‌పోర్టు ఇచ్చారని ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన విచారణలో రాజన్ వెల్లడించాడు. ఉగ్రవాదులతోను, భారత వ్యతిరేక శక్తులతోను తాను పోరాడుతున్నానని, తనకు సాయం చేసిన వాళ్ల పేర్లు ఏంటో ఇప్పుడు బయట పెట్టలేనని అన్నాడు. దేశ ప్రయోజనాల కోసమే తాను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడానని చెప్పాడు.

దాదాపు పాతికేళ్ల నుంచి ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటున్న ఛోటా రాజన్‌ను గత సంవత్సరం ఇండోనేసియాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముందుగా అతడిపై నకిలీ పాస్‌పోర్టు కలిగి ఉన్నందుకు కేసు పెట్టారు. అతడితో పాటు మరో ముగ్గురు మాజీ పాస్‌పోర్టు అధికారుల మీద కూడా ఈ కేసు నమోదైంది. భారతీయ నిఘా సంస్థలకు 1993 ముంబై పేలుళ్ల నిందితుల గురించి తాను సమాచారం ఇస్తున్నట్లు తెలియడంతో దావూద్ మనుషులు తనను చంపేందుకు ప్రయత్నించారని విచారణలో రాజన్ తెలిపాడు. తన అసలు పాస్‌పోర్టును దుబాయ్‌లో వాళ్లు లాగేసుకున్నారని అన్నాడు. రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. ఉగ్రవాదులపై పోరాటం సాగించేందుకే తాను తన గుర్తింపును రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని తెలిపాడు.

మరిన్ని వార్తలు