ట్రంప్‌కు ఘాటు రిప్లై ఇచ్చిన కేంద్ర మంత్రి

22 Apr, 2017 21:25 IST|Sakshi
ట్రంప్‌కు ఘాటు రిప్లై ఇచ్చిన కేంద్ర మంత్రి

బెంగళూరు: యుఎస్ ఇమ్మిగ్రేషన్ విధానంపై కేంద్ర ఐటీ శాఖామంత్రి రవి శంకర్ ప్రసాద్  ఘాటుగా  స్పందించారు. భారతీయ ఐటి కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి తప్ప దొంగిలించవని వ్యాఖ్యానించారు.  దేశంలోని ఐటి రంగ  ప్రతినిధులతో  మాట్లాడిన కేంద్రమంత్రి  హెచ్‌ 1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ కొత్త ఆదేశాలపై స్పందించారు. అంతేకాదు శనివారం వరుస ట్వీట్లలో  ఐటీ కంపెనీల సామర్థ్యాలపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  భారతీయ ఐటీ కంపెనీలకు  ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, బిగ్‌ డేటా  తదితర  అంశాల్లో భారీ అవకాశాలున్నాయని ట్వీట్‌ చేశారు.  

బెంగళూరులో దేశంలోని ఐటి రంగ  ప్రతినిధులతో  మాట్లాడిన కేంద్రమంత్రి భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో లేదా ఏ ఇతర దేశంలో గాని ఉద్యోగాలను దొంగిలించవని స్పష్టం చేశారు.  బహుళ జాతి సంస్థల పెద్ద వ్యాపారంలో  భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వా‍మ్యం అవసరమన్నారు. ఇది పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ క్రమంలో భారతీయ ఐటి కంపెనీలు ప్రపంచాన్ని జయించాయి, ఇప్పుడు భారతదేశంవైపు తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందని  చెప్పారు.  ‘డిజిటల్‌ ఇండియా’తో విస్తృత మార్కెట్‌ ఏర్పడిన దృష్ట్యా తిరిగి భారత్‌లో సేవలవైపు చూడాల్సిన  సమయం ఇదని పేర్కొన్నారు.

 కాగా బై అమెరికా, హైర్‌ అమెరికా  అంటూ హెచ్‌-1బీ వీసాల విధానంపై కఠిన వైఖరి అనుసరిస్తున్న ట్రంప్‌ ఇటీవల కొత్త కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు.  తమ ఉద్యోగాలు తమకే కావాలన్న నినాదంతో  వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చారు.  అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలు తన్నుకుపోతున్నాయని ట్రంప్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు