కోర్టుకు రావాలంటే 2,200 కి.మీ నడవాలి!

23 Oct, 2015 15:50 IST|Sakshi
కోర్టుకు రావాలంటే 2,200 కి.మీ నడవాలి!

కోల్‌కతాకు చెందిన ఓ జైనమత సాధువు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు 8 నెలల గడువు కోరారు. జైనమత విశ్వాసం ప్రకారం సర్వసంగ పరిత్యాగం చేసిన తాను వాహనాన్ని ఉపయోగించకూడదని, ఈ నేపథ్యంలో తాను ఉంటున్న కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు వచ్చేందుకు 2,200 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుందని, ఇందుకు తనకు 8 నెలల గడువు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వచ్చే నెలలోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.

జైనమఠాల్లో చిన్నారులను చేర్చుకోవడం చట్టబద్ధమేనని పేర్కొంటూ ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసినట్టు ఆచార్య కీర్తి యషురిష్వర్జీ మహారాజ్ (60) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనకు కోర్టు సమన్లు జారీచేసింది. అయితే, వృద్ధాప్యం, వెన్నెముకలో గాయం కారణంగా తాను రోజుకు 10-12 కిలోమీటర్లకు మించి నడవలేనని, కాబట్టి తాను కోర్టుకు హాజరయ్యేందుకు 8 నెలల గడువు కావాలని కోరారు. తాను కోర్టుకు రాకపోయినప్పటికీ, న్యాయవిచారణకు ఎలాంటి భంగం వాటిల్లదని.. కాబట్టి తనకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు తాజాగా ఆయనకు వ్యతిరేకంగా మరో వారెంట్‌ను జారీచేసింది.

అహ్మదాబాద్‌కు చెందిన హక్కుల కార్యకర్త జాస్మిన్ షా మహారాజ్‌పై కోర్టులో కేసు వేశారు. జైనమతం ప్రకారం 'బాలదీక్ష' తీసుకోవడం చట్టబద్ధమేనంటూ ఆయన కేంద్రప్రభుత్వ గెజిట్ ఉత్తర్వులను ఫోర్జరీ చేశారని, అందుకే ఆయనను కోర్టుకు లాగామని జాస్మిన్ తరఫు న్యాయవాది తెలిపారు. 'బాలదీక్ష' లాంటి చర్యలను నియంత్రించాలని గుజరాత్ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. భారత్‌లో దాదాపు 40 లక్షల వరకు జైనమతస్తులు ఉన్నారు. వీరిలో అత్యధికం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో నివసిస్తున్నారు.

మరిన్ని వార్తలు