తప్పు చూపించాడని.. ఉద్యోగం పీకేసిన ఫేస్బుక్!

13 Aug, 2015 17:50 IST|Sakshi
తప్పు చూపించాడని.. ఉద్యోగం పీకేసిన ఫేస్బుక్!

ఫేస్బుక్.. ఆ కంపెనీలో ఉద్యోగం గానీ, ఇంటర్న్షిప్ గానీ వస్తే చాలన్నది బీటెక్ విద్యార్థుల కల. కానీ, అది కూడా అన్ని కంపెనీల లాంటిదేనని తేలిపోయింది. మెసెంజర్ యాప్లో ఉన్న ఓ పెద్ద లోపాన్ని ఎత్తి చూపించినందుకు భారత సంతతికి చెందిన ఓ యువ ఇంజనీర్ ఇంటర్న్షిప్ రద్దు చేసింది. పైగా అతడు ఆషామాషీ కుర్రాడు కాదు.. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చినవాడు. అరన్ ఖన్నా అనే ఆ కుర్రాడు ఓ ప్లగిన్ రూపొందించాడు. దాన్ని బట్టే ఫేస్బుక్ మెసెంజర్లో ఉన్న ఓ అతిపెద్ద లోపం బయటపడింది. మెసెంజర్ ద్వారా ఎవరైనా చాట్ చేస్తుంటే.. తాము ఎక్కడున్నామన్న విషయం అవతలి వాళ్లకు ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది. దాంతో.. విజయవాడలో ఉండి చాట్ చేస్తూ, నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పడానికి వీలుండదు. అంటే.. చాట్ చేసేవాళ్ల గుట్టంతా రట్టయిపోతుందన్నమాట.

అరన్ రూపొందించిన ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే.. ఒక కన్వర్సేషన్ త్రెడ్లో ఉన్నవాళ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నారన్న విషయం కూడా తెలిసిపోతుంది. అవతలివాళ్లు ఫేస్బుక్లో తమకు ఫ్రెండ్స్ కాకపోయినా కూడా వాళ్లెక్కడున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం అరన్ కనిపెట్టడంతో.. అతడు రూపొందించిన ప్లగిన్ను 85 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ద గార్డియన్, డైలీ మెయిల్, హఫింగ్టన్ పోస్ట్.. ఇలాంటి ప్రముఖ పత్రికలన్నీ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అయితే, ఫేస్బుక్ యాజమాన్యం వెంటనే ఆ ప్లగిన్ను డిజేబుల్ చేయాలని చెప్పడంతో అతడు వెంటనే డిజేబుల్ చేసేశాడు. మీడియాతో మాట్లాడొద్దని చెప్పడంతో అలాగే చేశాడు. వారం రోజుల తర్వాత ఫేస్బుక్ తన మెసెంజర్ యాప్ను అప్డేట్ చేసింది. కానీ అరన్ ఖన్నా ఉద్యోగాన్ని మాత్రం పీకేసింది.

మరిన్ని వార్తలు