తండ్రి రాజీనామా.. కుమారుడికి పదవి

23 Jan, 2017 19:49 IST|Sakshi
తండ్రి రాజీనామా.. కుమారుడికి పదవి

పోర్ట్లూయిస్‌: భారత సంతతికి చెందిన మారిషస్ ప్రధాని అనిరుధ్‌ జగన్నాథ్‌ (86) తన పదవికి రాజీనామా చేసి.. కొడుకు, ఆర్థిక మంత్రి ప్రవింద్‌ జగన్నాథ్‌ (50)కు బాధ్యతలు అప్పగించారు. సోమవారం ప్రవింద్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆ దేశాధ్యక్షుడు అమీనా గురిబ్‌-ఫకీమ్‌ నియామక లేఖ పంపారు. అనంతరం ప్రవింద్‌ కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.

అనిరుధ్‌ జగన్నాథ్‌ మాట్లాడుతూ.. యంగ్‌, డైనమిక్ నాయకుడిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు వీలుగా తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మారిషస్ జాతీయ అసెంబ్లీలో అధికార మిలిటెంట్‌ సోషలిస్ట్ మూవ్మెంట్‌ పార్టీకి మెజార్టీ ఉంది. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం జాతీయ అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల మద్దతు గల సభ్యుడిని ప్రధానిగా అధ్యక్షుడు నియమిస్తారు. కాగా అధికార మార్పిడిని ప్రతిపక్ష లేబర్ పార్టీ తప్పుపట్టింది. దేశానికి చీకటి దినమని, ఇది తండ్రీకొడుకుల ఒప్పందం అని విమర్శించింది.

మరిన్ని వార్తలు