మీ దేశానికి వెళ్లిపోండి..

6 Mar, 2017 03:20 IST|Sakshi
మీ దేశానికి వెళ్లిపోండి..

అమెరికాలో మరో భారతీయుడిపై పేలిన విద్వేషపు తూటా
- వాషింగ్టన్‌లో సిక్కు యువకుడు దీప్‌ రాయ్‌పై కాల్పులు
- మీ దేశానికి వెళ్లిపోండని అరుస్తూ పారిపోయిన దుండగుడు
- భుజంలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌.. కోలుకుంటున్న దీప్‌ రాయ్‌
- సిక్కు సంఘాల ఆగ్రహం.. భారతీయ అమెరికన్లలో ఆందోళన
- బాధితుడి తండ్రితో మాట్లాడిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌
- భారతీయుల కోసం ట్రంప్‌తో మోదీ మాట్లాడాలి: ఖర్గే


వాషింగ్టన్‌:
అమెరికాలో భారతీయులపై విద్వేషపూరిత ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్న కాన్సస్‌లో శ్రీనివాస్‌ కూచిభొట్ల.. నిన్న దక్షిణ కరోలినాలో హర్నీశ్‌ పటేల్‌పై దాడులు జరగ్గా ఇప్పుడు మరో భారతీయుడిపై జాత్యహంకార తూటా పేలింది. తాజాగా, న్యూయార్క్‌లో భారత–అమెరికన్‌ దీప్‌ రాయ్‌ (39) అనే సిక్కు యువకుడిపై ముసుగువేసుకున్న ఆగంతకుడు ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని అరుస్తూ కాల్పులు జరిపాడు.

శుక్రవారం అర్ధరాత్రి ఇంటిముందు కారు వద్ద నిలబడ్డ దీప్‌ రాయ్‌ దగ్గరకు వచ్చిన ఆగంతకుడు కాసేపు వాగ్వాదం తర్వాత కాల్పులు జరిపాడని కెంట్‌ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆగంతకుడు గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపి పారిపోయాడన్నారు. దీంతో బాధితుడి భుజంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిందని కెంట్‌ పోలీస్‌ కమాండర్‌ జరోడ్‌ కేస్నర్‌ వెల్లడించారు. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అందుకే ఎఫ్‌బీఐతోపాటు ఇతర ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు ఆగంతకుడి కోసం గాలిస్తున్నామన్నారు. ‘దేశంలో ఇటీవల నెలకొన్న అనిశ్చితి, ఆందోళనకు కొందరు అమెరికన్లు ఎమోషనల్‌గా స్పందించటమే కారణమనిపిస్తోంది. అవతలి వ్యక్తి రంగు, ప్రాంతం ఆధారంగా నేరానికి పాల్పడటం సరికాదు’ అని కేస్నర్‌ తెలిపారు.

భారతీయ–అమెరికన్లలో ఆందోళన
వరుస విద్వేషపూరిత ఘటనలతో భారత అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ‘పరిస్థి తులు చాలా భీకరంగా ఉన్నాయి. రోజురో జుకూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. బహి రంగ ప్రదేశాల్లోనూ వ్యక్తిగత ప్రదేశాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వర్ణవి వక్ష దూషణలు, విద్వేషపూరితమైన చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని భారత– అమెరికన్‌ డెమోక్రటిక్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడిం చింది. కాన్సస్, న్యూయార్క్, వాషింగ్టన్‌లలో జరిగిన మూడు ఘటనల్లోనూ బాధ్యులు ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని గట్టిగా అరుస్తూ దాడులకు దిగటం ద్వారా ఇవి విద్వేషపూరిత ఘటనలేనని భావిస్తున్నామని తెలిపింది. భారతీయుల హక్కులను కాపాడేందుకు, భద్రతపై భరోసా ఇచ్చేందుకు నాయకులు, సంఘాలను కలుపుకుని ముందుకెళ్తామని ఇండియా సివిల్‌ వాచ్‌ అనే సంస్థ తెలిపింది.

దీప్‌రాయ్‌ ఘటనను విద్వేషపూరిత ఘటనగా గుర్తించి విచారణ జరపాలంటూ అమెరికా సిక్కు సంఘాలు డిమాండ్‌ చేశాయి. అమెరికాలోని సిక్కులపై ఇటీవల వేధింపులు, దాడులు ఎక్కువయ్యాయని రెంటాన్‌ ప్రాంత సిక్కు వర్గం నేత జస్మీత్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఘటనతో అతని కుటుంబంతో పాటు భార తీయ అమెరికన్లలో ఆందోళన పెరిగిందన్నారు. ‘సెప్టెంబర్‌ 11’ ఘటన తర్వాత గురుద్వా రాలు, సిక్కు సమాజంపై దాడులు జరుగు తూనే ఉన్నాయని తెలిపారు. ‘అయితే అప్పట్లో శాంతి భద్రతలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వటంతో కాస్త ధైర్యంగా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి’ అని జస్మీత్‌ సింగ్‌ వెల్లడించారు.

దురదృష్టకరం: సుష్మ
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దీప్‌ రాయ్‌పై కాల్పుల ఘటన దురదృష్టకరం. బాధితుడి తండ్రి సర్దార్‌ హర్‌పాల్‌ సింగ్‌తో మాట్లాడాను. భుజంలో గాయమైందని ఆయన తెలిపారు. వారికి మేం అండగా ఉంటాం. చికిత్స పొందుతున్న దీప్‌ రాయ్‌ పరిస్థితి నిలకడగానే ఉంది’ అని సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. దీప్‌ రాయ్‌ మాట్లాడగలుగుతున్నారని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. దక్షిణ కరోలినాలో హర్నీశ్‌ పటేల్‌ హత్య ఘటనపైనా విచారణ జరుగుతోందని.. భారత రాయబార కార్యాలయ అధికారులు బాధితుడిని చేరుకుని కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారని సుష్మ తెలిపారు. భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం ఇన్‌చార్జ్, మేరీకే ఎల్‌ కార్ల్‌సన్‌ కూడా తాజా కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ‘దీప్‌ రాయ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. అమెరికా అధ్యక్షుడు కూడా విద్వేషం ఏ రూపంలో ఉన్నా ఖండించాలని తెలిపారు’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు.

మోదీ ‘కామ్‌ కీ బాత్‌’ చేయాలి: ఖర్గే
అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులను అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌  వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడాలని.. లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే కోరారు. బెంగళూరులోని కలబుర్గిలో ఆదివారం మాట్లాడుతూ.. ‘కేంద్రం వెంటనే రంగంలోకి దిగి భారతీయులపై దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో అంతర్జాతీయ సంక్షోభం తప్పదు’ అని హెచ్చరించారు. పదిరోజుల వ్యవధిలో భారతీయులపై మూడుచోట్ల విద్వేషపూరిత దాడులు జరగటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ను పక్కన పెట్టి ‘కామ్‌కీ బాత్‌’ను ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.
 

మరో విద్వేషపు తూటా!

‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’
అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి
అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు

 

మరిన్ని వార్తలు