కార్డుబోర్డుతో ఇంక్యుబేటర్.. భారత విద్యార్థి ప్రతిభ

7 Nov, 2015 16:59 IST|Sakshi
కార్డుబోర్డుతో ఇంక్యుబేటర్.. భారత విద్యార్థి ప్రతిభ

ముందుగానే పుట్టడం, బరువు తక్కువగా పుట్టడం.. ఇలా రకరకాల సమస్యలతో సతమతమయ్యే చిన్నారుల జీవితాలను రక్షించేందుకు లండన్‌లో చదివే భారతీయ విద్యార్థి మాలవ్ సంఘవి.. నడుం బిగించాడు. అతి తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్ తయారు చేశాడు. దీనికి బేబీ లైఫ్ బాక్స్ అని పేరు పెట్టాడు. ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో ఇన్నోవేషన్ డిజైన్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డ్యుయెల్ డిగ్రీ కోర్సు చేస్తున్న మాలవ్ ఈ ఇంక్యుబేటర్‌ను కార్డుబోర్డుతోనే తయారు చేయడం విశేషం.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మాలవ్ సంఘవి... లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన ఓ పోటీలో పాల్గొని తన ఆవిష్కరణకు 3వ బహుమతిని గెలుచుకున్నాడు. నవజాత శిశువుల సంరక్షణ కోసం తగిన సదుపాయాలుండే ఇంక్యుబేటర్... వైద్య సదుపాయాలు లేని భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు బాగా ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నాడు. దీనిలోని  దిగువ భాగం లో ఉండే 'కాట్' పుట్టిన తర్వాత బిడ్డకు తల్లిలా రక్షణ ఇస్తుంది. పుట్టుక సమయంలో బిడ్డలకు వచ్చే అంటువ్యాధులు, ఇంకా పూర్తిగా ఎదగకుండానే పుట్టడం లాంటి సమస్యలకు ఇంక్యుబేటర్లే పరిష్కారం.


కొన్నాళ్ల క్రితం మాలవ్ బంధువుల బిడ్డను ఇంక్యుబేటర్‌లో ఉంచడం వల్ల సజీవంగా బయటపడటంతో అతడికి ఈ ఆలోచన వచ్చింది. నగరాల్లో ఇటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, మారుమూల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో  తక్షణ సంరక్షణ పొందడానికి మాలవ్... కార్డుబోర్డుతో ఈ కొత్త ఇంక్యుబేటర్‌ను తయారు చేశాడు. తన ప్రయోగాలను మరింత అభివృద్ధి పరిచేందుకు నిధుల సేకరణలో నిమగ్నమైన మాలవ్... తన బోర్డులోకి మరింతమంది నిపుణులను తీసుకొని, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఇంక్యుబేటర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మాలవ్ తన ఆలోచనను బయటపెట్టగానే అప్పటికప్పుడే  పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభించింది. తమ మొదటి పరిశోధన ప్రకారం భారతదేశంలోని ఆరోగ్య సేవా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో పుట్టే బిడ్డలకు మంచి సౌకర్యాలను అందించే అవకాశం ఉందంటున్నారు మాలవ్.

మరిన్ని వార్తలు