ఐటీసీ లాభం 18% అప్

26 Jul, 2013 03:33 IST|Sakshi

న్యూఢిల్లీ:   సిగరెట్ల బిజినెస్‌లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరించిన ఐటీసీ... ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. జూన్ క్వార్టర్‌లో 18% అధికంగా రూ. 1,891 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో అంటే ఏప్రిల్-జూన్’12లో రూ. 1,602 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఈ కాలంలో అమ్మకాలు కూడా 10%పైగా పుంజుకుని రూ. 7,339 కోట్లకు ఎగ శాయి. గతంలో రూ. 6,652 కోట్లుగా నమోదయ్యాయి. సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు, వినియోగ వ్యయాలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలోనూ సంతృప్తికర స్థాయిలో రాణించగలిగినట్లు కంపెనీ తెలిపింది. అయితే బుధవారం ఒక దశలో చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ. 380ను తాకిన షేరు ధర, గురువారం బీఎస్‌ఈలో దాదాపు 5% పతనమై రూ. 359 వద్ద ముగిసింది.
 
 సిగరెట్లేతర ఆదాయం 18% ప్లస్
 సమీక్షా కాలంలో ఎఫ్‌ఎంసీజీ ఆదాయం 11% వృద్ధితో రూ. 5,282 కోట్లను తాకింది. దీనిలో సిగరెట్ల బిజినెస్ 7% పెరిగి రూ. 3,537 కోట్లకు చేరగా, సిగరెట్లేతర విభాగం ఆదాయం 18%పైగా జంప్‌చేసి రూ. 1,745 కోట్లయ్యింది.  అయితే బ్రాండెడ్ ప్యాకేజీ ఫుడ్స్ బిజినెస్ భారీగా పుంజుకున్నదని తెలిపింది. ఇక ఎఫ్‌ఎంసీజీయేతర బిజినెస్ నుంచి కూడా ఆదాయం 21% ఎగసి రూ. 3,602 కోట్లను అధిగమించినట్లు తెలిపింది. వీటిలో హోటళ్లు, వ్యవసాయం, పేపర్ బోర్డ్, ప్యాకేజింగ్ వంటివి ఉన్నాయి. మొత్తం వ్యయాలు దాదాపు 7% పెరిగి రూ.4,835 కోట్లకు చేరాయి.

మరిన్ని వార్తలు