విదేశాల్లో పండుగ చేస్కో!

9 Nov, 2015 21:10 IST|Sakshi
విదేశాల్లో పండుగ చేస్కో!

ముంబై: సాధారణంగా భారతీయులు దీపావళి పండుగను బంధుమిత్ర పరివారంతో ఇంటివద్దే జరుపుకుంటారు. ఇంటి ముందట టపాసులు కాల్చి సంబరాలు జరుపుతారు. కానీ ఆ సంప్రదాయం ఇప్పుడు మారుతున్నట్టు కనిపిస్తున్నది. దీపాల పండుగను భారతీయులు విదేశాల్లో జరుపుకొనేందుకు ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నారట. విదేశాల్లో దీపావళి పండుగను ఆస్వాదించేందుకు పెద్దసంఖ్యలో భారతీయులు సిద్ధమవుతున్నారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది.

'ఒకప్పుడు కుటుంబ పరిధిలో ఇంటివద్దే జరుపుకొనే దీపావళి పండుగను ఇప్పుడు భారతీయులు విదేశాల్లో జరుపుకొనేందుకు ఉత్సాహం చూపించడం నిజంగా మంచి విషయమే' అని సర్వే నిర్వహించిన హోటల్స్.కామ్ తెలిపింది. దీపావళి సందర్భంగా యూరప్ దేశాలకు వెళ్లేందుకు భారతీయులు అధిక ఆసక్తి కనబరుస్తున్నారని ఈ సర్వేలో తెలిపింది.

దేశీయంగా గోవా ఈ విషయంలో టాప్ స్థానంలో ఉంది. దీపావళి పండుగతో భారత్‌లో సెలవుల సీజన్ ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా విదేశాలకు వెళ్లేందుకు భారతీయులు ఆసక్తి చూపుతున్నారని సర్వే తెలిపింది. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే దీపావళి పండుగ సంబరాలను వీక్షించేందుకు సాధారణంగా విదేశీయులు భారత్‌కు వస్తుంటారని, అదేసమయంలో భారతీయులు కూడా విదేశాల్లో పండుగ జరుపుకొనేందుకు వెళుతున్నారని పేర్కొంది.

 

>
మరిన్ని వార్తలు