చైనా-పాకిస్తాన్ కారి‘డర్’!

5 Sep, 2016 01:58 IST|Sakshi
చైనా-పాకిస్తాన్ కారి‘డర్’!

పీఓకేలో ఆర్థిక కారిడార్‌పై భారత్ అభ్యంతరం
- జీ20లో జిన్‌పింగ్‌తో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
- సత్ససంబంధాల కొనసాగింపుపై ఆసక్తిగా ఉన్నాం: జిన్‌పింగ్
 
 హాంగ్జౌ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) నిర్మాణంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జీ20 దేశాల సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఒకరి వ్యూహాత్మక వ్యవహారాల  పట్ల మరొకరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందని మోదీ సూచించారు. రాజకీయ కారణాలతో ఉగ్రవాద వ్యతిరేక పోరు ప్రభావితం కాకూడదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు మోదీ స్పష్టం చేశారు. దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాల కోసం ఒకరి ఆకాంక్షలు, ఆందోళనలు, వ్యూహాత్మక అవసరాల్ని మరొకరు గౌరవించడం అత్యంత ముఖ్యమని చర్చల్లో వెల్లడించారు. ఇరు దేశాధినేతల భేటీలో సీపెక్‌పై భారత్ అభ్యంతరం ప్రస్తావనకు వచ్చిందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు.

దాదాపు రూ. 3,12,800 కోట్లతో అరేబియా సముద్రం గ్వదర్ పోర్టు నుంచి చైనా గ్జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌కు సీపెక్‌ను నిర్మిస్తున్నారు. చమురు, సహజవాయువుల రవాణా కోసం రైలు, రోడ్డు మార్గాల నిర్మాణంతో పాటు ఇంధన ఆధారిత ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. ‘ఇరు దేశాల మధ్య వ్యతిరేక దృక్పథం పెరుగుదల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దు వివాదంలో శాంతి, సంయమనం పాటించడంలో ఇరు దేశాలు విజయవంతమైన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఇటీవల కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్‌లోని చైనా రాయబార కార్యాలయంలో బాంబు దాడిని ప్రధాని ఖండించారు. ఉగ్రవాద ముప్పు కొనసాగుతుందనడానికి ఆ సంఘటన ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు’ అని స్వరూప్ విలేకరులకు చర్చల సారాంశాన్ని వెల్లడించారు.

ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యత్వంపై చైనా అభ్యంతరాన్ని మోదీ లేవనెత్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. ‘భేటీలో జరిగిన ప్రతి అంశంపై మాట్లాడలేను. మోదీ-జిన్‌పింగ్ చర్చలు రెండు దేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశం. అన్ని సంబంధాలపై సలహాలు, దిశానిర్దేశం కోసం వీటిని నిర్వహిస్తారు. భారత్- చైనా సంబంధాలపై వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తామని మోదీ ఎప్పుడూ చెపుతుండేవారు. భారత్, చైనాల భాగస్వామ్యం రెండు దేశాలకే కాకుండా ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కీలకం. ఆ దేశంతో సన్నిహత సంబంధాలు, అభివృద్ధి భాగస్వామ్యం కోసం భారత్ కృషిచేసింది. సాంస్కృతిక, ప్రజా సంబంధాలు కూడా పెరిగాయి’ అని స్వరూప్ పేర్కొన్నారు.  

 ఉన్నతస్థాయి చర్చలు కొనసాగాలి: జిన్‌పింగ్
 సత్ససంబంధాల్ని కొనసాగించేందుకు, ద్వైపాక్షిక సహకారంలో మరింత ప్రోత్సాహానికి చైనా ఆసక్తిగా ఉందన్న విషయాన్ని మోదీకి జిన్‌పింగ్ వెల్లడించారని ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ముఖ్య విషయాల్లో చైనా, భారత్‌లు ఒకరినొకరు గౌరవించుకోవాలని, జాగ్రత్తగా మెలగాలని చైనా అధినేత స్పష్టం చేశారని, అభివృద్ధి చెందుతున్న ఇరుగు పొరుగు దేశాలు కావడంతో ఉన్నత స్థాయి దౌత్య చర్చలు కొనసాగించాలన్నారని జీ ఆకాంక్షించారంటూ ఆ పత్రిక వెల్లడించింది. వివిధ స్థాయిలో, వివిధ ప్రాంతాల్లో చైనా-భారత్‌లు చర్చలు కొనసాగించాలని, అవగాహన, నమ్మకం నెలకొనేలా ప్రధాన అంశాల్లో ఉమ్మడి ఆసక్తులపై తరచుగా అభిప్రాయాలు పంచుకోవాలని జిన్‌పింగ్ అభిలషించారని తెలిపింది. అభివృద్ధి వ్యూహాల అమలుకు ఉమ్మడిగా పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పత్తి అంశాల్లో కార్యసాధక సహకారం కోసం చర్చలు కొనసాగాలని చైనా అధ్యక్షుడు ఆకాక్షించారు. ఈ సందర్భంగా చైనా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని మోదీకి హామీనిచ్చారు.

 మోదీకి కానుకగా చైనీస్ అనువాదాలు
 చైనా చిత్రకారుడు షెన్ షూ వేసిన మోదీ ఆయిల్ పెయింటింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు. అలాగే భగవద్గీత, స్వామి వివేకానంద వ్యాసాలు సహా 10 ప్రముఖ భారతీయ రచన చైనీస్ అనువాద ప్రతుల్ని కూడా అందచేశారు. వీటిని పెకింగ్ యూనివర్సిటీలో హిందీ బోధించే ప్రొఫెసర్ వాంగ్ జీచెంగ్ చైనీస్‌లోకి అనువ దించారు. అనువాదాల్లో పతంజలి యోగా సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, యోగా వశిష్ఠలు కూడా ఉన్నాయి.
 
 చర్చలు సరిపోవు.. కార్యాచరణ అవసరం
 ఆర్థిక మందగమనంపై జీ 20 సదస్సులో మోదీ
హాంగ్జౌ: ప్రపంచ ఆర్థిక మందగమనంపై పోరులో తీవ్ర స్థాయి చర్చలు సరిపోవని జీ20 సదస్సులో ప్రధాని మోదీ అన్నారు. కలిసికట్టుగా, సమన్వయంతో సాగుతూ... లక్ష్య శుద్ధితో కూడిన కార్యచరణతో ప్రపంచ ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించేలా జీ 20 దేశాలు  ప్రయత్నించాలని కోరారు. ‘ ప్రపంచం సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోన్న వేళ మనం సమావేశమయ్యాం. ఈ సమస్యల పరిష్కారానికి మేధోమథన చర్చలు కూడా సరిపోవు. ప్రపంచ ఆర్థిక వృద్ధి పట్టాలెక్కేలా నిర్మాణాత్మక సంస్కరణలపై నేను ఒక అజెండా రూపొందించా. ఆర్థిక వ్యవస్థల్ని మెరుగుపర్చడం, దేశీయ ఉత్పత్తికి ఊతం, మౌలిక రంగంలో పెట్టుబడులు పెంచడం, నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరముంది. మన సవాళ్లు ఎప్పుడూ ఉంటాయి.

అలాగే అవకాశాలు కూడా... తర్వాతి తరం ప్రపంచ అభివృద్ధికి సాంకేతిక అనుసంధానం, డిజిటల్ విప్లవం, నూతన ఆవిష్కరణలు పునాది వేస్తాయి. అందరి ప్రయోజనం కోసం జీ 20 నిర్ణయాత్మకంగా పనిచేయాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ జీడీపీలో 85 శాతంజీ 20 దేశాలదే... అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, జపాన్, ఇటలీ, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌లు సభ్యులుగా ఉన్నాయి.

 అధిక ఉక్కు ఉత్పత్తిపై చర్యలు: ఈయూ
 ఉక్కు అధికోత్పత్తిపై చైనా చర్యలు తీసుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ నేతలు జీ 20 సదస్సులో కోరారు. యాపిల్ సంస్థ నుంచి ఐర్లాండ్ పన్నులు వసూలు చేయాలన్న తీర్పును కూడా ఈయూ సమర్ధించింది. అధిక ఉక్కు ఉత్పత్తిపై అమెరికా, చైనా, జర్మనీ సహా ఇతర ముఖ్య ఆర్థిక వ్యవస్థలు తక్షణం పరిష్కారం కనుగొనాలని ఈయూ అధ్యక్షుడు జీన్ క్లౌడ్ జంకెర్ కోరారు. యాపిల్ నుంచి పన్ను వసూలు తీర్పును అమెరికా విమర్శించడాన్ని జంకర్ తోసిపుచ్చారు.
 
 పాక్-చైనా రక్షణ బంధం
 ఇస్లామాబాద్: చైనాతో దీర్ఘకాల రక్షణ సంబంధాలకోసం కుదుర్చుకునే ఒప్పందానికి పాకిస్తాన్ కేబినెట్ ఆదివారం ఆమోదముద్ర వేసింది. భారత్-అమెరికా సంబంధాలు బలోపేతమవుతున్న నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాల్లో పరస్పర సహకారంతోపాటు రక్షణ, భద్రత రంగాల్లో చైనాతో దీర్ఘకాల ఒప్పందాలు చేసుకోవటంపైనే సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు