క్యాడ్ ఓకే... అయినా సవాళ్లు తొలగలేదు

5 Dec, 2013 02:57 IST|Sakshi
క్యాడ్ ఓకే... అయినా సవాళ్లు తొలగలేదు

 సింగపూర్: కరెంట్ ఎకౌంట్ లోటు (సీఏడీ-క్యాడ్)కు సంబంధించి ఒడిదుడుకులు తొలగిపోయినట్లేనని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ క్యాపిటల్ ఎకనమిక్స్ పేర్కొంది. బంగారం దిగుమతులపై ప్రభుత్వ ఆంక్షలు, విధానాల వల్లే ప్రధానంగా క్యాడ్ తగ్గినట్లు కూడా పేర్కొంది. మొత్తంమీద ఈ పరిస్థితి విదేశీ మారకంలో రూపాయి ఒడిదుడుకులను నివారించడానికి, దేశంలో పెట్టుబడులకు సంబంధించి గ్లోబల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మెరుగుపరచడానికి దోహదపడుతుందని నివేదిక విశ్లేషించింది.  రెండవ త్రైమాసికం  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో క్యాడ్ 1.2 శాతం (5.2 బిలియన్ డాలర్లకు) కట్టడి జరిగిన నేపథ్యంలో క్యాపిటల్ ఎకనమిక్స్ ఈ తాజా నివేదికను వెలువరించింది. క్యాడ్ కట్టడికి సంబంధించి  అంతర్జాతీయ కోణంలో దేశం ఆర్థిక వ్యవస్థ విజయం సాధించినట్లేనని పేర్కొంది. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకపు నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసమే క్యాడ్.
 
 సవాళ్లు ఇవీ...
 క్యాడ్ ఒత్తిడి తగ్గినా, దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం సమస్యలు తొలగిపోలేదని  క్యాపిటల్ ఎకనమిక్స్ పేర్కొంది. 10 శాతం వద్ద తీవ్రంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం వల్ల దీనికి హెడ్జ్‌గా బంగారం కొనుగోళ్ల అవకాశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇక ద్రవ్యోల్బణంతో పాటు ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి ప్రభుత్వం ఎలా కట్టడి చేయగలుగుతుందన్న అంశం కూడా సందేహాస్పదంగానే ఉందని నివేదిక పేర్కొంది.
 
 క్యాడ్ కట్టడి కొనసాగవచ్చు: ఇండియా రేటింగ్స్
 కాగా మూడు, నాలుగు త్రైమాసికాల్లో కూడా క్యాడ్ కట్టడి కొనసాగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తాజాగా అంచనావేసింది. ఎగుమతులు పెరగడం, బంగారం దిగుమతులు తగ్గడానికి ప్రభుత్వ విధానాలు ఇందుకు దోహదపడే అంశాలుగా పేర్కొంది.
 

మరిన్ని వార్తలు