‘హిందూత్వ’పై భారీ సమ్మేళనం

22 Jul, 2017 19:00 IST|Sakshi
‘హిందూత్వ’పై భారీ సమ్మేళనం

వారణాసి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ‘హిందూత్వం–సోషల్‌ మీడియా’పై  మహాసమ్మేళనం నిర్వహించాలని బీజేపీ–ఆరెస్సెస్‌ మేథావుల సంఘం ‘భారత్‌ నీతి’ నిర్ణయించింది. వామపక్ష భావాజాలంలో పడకుండా యువతను నివారించడంతోపాటు వారిలో నరనరాన హిందూత్వ భావాజాలాన్ని నిప్పేందుకు ఇలాంటి సమ్మేళనాలు అవసరమైని అభిప్రాయపడింది. హిందూత్వం పట్ల సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని, అందుకు తగిన సామాజిక కార్యకర్తలను తయారు చేసేందుకు కూడా ఈ సమ్మేళనం ఉపయోగపడుతుందని భారత్‌ నీతి భావిస్తోంది.

నవంబర్‌ నెలలో నిర్వహించే ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ను ఆహ్వానించగా, అందుకు ఆయన అంగీకరించారని తెల్సింది. సోషల్‌ మీడియాలో హిందూత్వాన్ని కించపరిచే పోస్టింగ్‌లు కూడా వస్తున్నాయని, వాటిని సకాలంలో అడ్డుకోవడంతోపాటు హిందూత్వాన్ని యువతలో ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్‌ నీతి కార్యవర్గ సభ్యుడు శైలేంద్ర సెంగార్‌ తెలిపారు. ఈ సమ్మేళనానికి మురళీ మనోహర్‌ జోషి లాంటి నాయకులు, హిందూత్వం వ్యాఖ్యాత డేవిడ్‌ ఫ్రాలి, ఇషా ఫౌండేషన్‌కు చెందిన సద్గురు జగ్గీ వాసుదేవ్‌ లాంటి వారు హాజరవుతారని ఆయన చెప్పారు.

హిందువులకు పూజ్యమైన ఆవు వల్ల కలిగే ప్రయోజనాలు, దాని ప్రాముఖ్యతమై సమ్మేళనంలో ప్రత్యేక గోష్ఠి ఉంటుందని శైలేంద్ర చెబుతున్నారు. దేశంలో మొదట హిందూత్వ పదానికి ప్రచారాన్ని 1923లో వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ తీసుకొచ్చారు. ఇప్పుడు హిందూత్వానికి సోషల్‌ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం కల్పించాలని భారత్‌ నీతి యోచిస్తోంది.

 

మరిన్ని వార్తలు