క్యాసినో... ‘డామన్’!

28 Nov, 2013 00:57 IST|Sakshi
క్యాసినో... ‘డామన్’!

గ్యాంబ్లింగ్‌కి, బెట్టింగ్‌కి పేరొందిన మకావూ, లాస్ వెగాస్ తరహాలో దేశీయంగా డామన్‌లోనూ అతి పెద్ద క్యాసినో సిద్ధమవుతోంది. ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో డెల్టా కార్ప్ దీన్ని సిద్ధం చేస్తోంది. భారత్‌లో గ్యాంబ్లింగ్ (రేసింగ్‌లు, బెట్టింగ్‌లు మొదలైనవి)మార్కెట్ విలువ ఏటా సుమారు 60 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇందులో సగభాగం అక్రమంగానే జరుగుతోంది. ప్రస్తుతం దేశీయంగా కొన్ని రాష్ట్రాలు మాత్రమే క్యాసినోలను అనుమతిస్తున్నాయి. సిక్కిం, గోవాలో మాత్రమే క్యాసినోలు ఉండగా.. తాజాగా పంజాబ్ వీటిపై దృష్టి సారిస్తోంది. ఇక, ఇక్కడ కుదరని వారు మకావూ, సింగపూర్, లాస్ వెగాస్ వంటి చోట్లకు వెడుతున్నారు. మొత్తం గ్యాంబ్లింగ్ మార్కెట్ టర్నోవర్‌లో సుమారు నాలుగు శాతం వాటా భారతీయులదే ఉంటోందని అంచనా. దీంతో ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనిలో భాగంగానే డెల్టా కార్ప్ దేశంలోనే అతి పెద్ద క్యాసినో ‘ది డెల్టిన్’ని డామన్ భూభాగంపై ఏర్పాటు చేస్తోంది. (ప్రస్తుతం చాలా మటుకు క్యాసినోలు ఆఫ్‌షోర్ అంటే సముద్ర భాగంలో ఉంటున్నాయి). డెల్టా కార్ప్‌కి గోవాలో 3 ఆఫ్‌షోర్ క్యాసినోలు ఉన్నాయి.
 
 అనేక ప్రత్యేకతలు..: ది డెల్టిన్‌లో 10 ఎకరాల్లో 60,000 చదరపు అడుగుల గేమింగ్ స్పేస్ ఉంటుంది. ఇందులో 187 గదులు కూడా ఉంటాయి. అలాగే, మూడు బార్లు, వివిధ రకాల వంటకాలను వడ్డించే నాలుగు రెస్టారెంట్లు ఉంటాయి. కార్పొరేట్ క్లయింట్ల కోసం డెల్టా కార్ప్ ప్రత్యేకంగా 29,000 చ.అ. స్థలం కేటాయిస్తోంది. దీన్ని కాన్ఫరెన్సులు, ఇన్‌డోర్ మీటింగులు, ఎగ్జిబిషన్లు మొదలైన వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, అంతర్జాతీయ క్యాసినోల తరహాలో 8,000 చ.అ. స్థలంలో హై ఎండ్ రిటైల్ బ్రాండ్స్ కొలువుతీరనున్నాయి.  క్యాసినో ఏర్పాటుకు డామన్‌ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని వివరించారు డెల్టా కార్ప్ చైర్మన్ జైదేవ్ మోడి.  అటు ముంబైకి, ఇటు గుజరాత్‌కి దగ్గర్లో ఉండటం వల్లే దీన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ముంబై నుంచి 3 గంటల ప్రయాణ దూరంలోనూ, గుజరాత్‌లోని ప్రధాన నగరాలకు ఇది దగ్గర్లోనూ ఉంది.
 
 ఏటా 20 శాతం వృద్ధి..
 గోవాలో డెల్టా కార్ప్‌కి చెందిన క్యాసినో వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందుతోంది. కంపెనీ క్యాసినోలకి వచ్చే వారి సంఖ్య ఏటా 20% పెరుగుతోంది. డెల్టా కార్ప్‌కి చెందిన ఇతర క్యాసినోలకు వచ్చే వారు ప్రతిసారీ సగటున రూ.12,000-15,000 ఖర్చు చేస్తున్నారు. ఈ క్యాసినోలకు వచ్చే వారిలో భారతీయులే ఉంటున్నారు. 24-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారు పోకర్‌ని ఆడేందుకు ఇష్టపడుతున్నారని మోడి వివరించారు.
 

>
మరిన్ని వార్తలు