పార్లే జీ బిస్కట్ల ఫ్యాక్టరీ మూసివేత

30 Jul, 2016 15:51 IST|Sakshi
పార్లే జీ బిస్కట్ల ఫ్యాక్టరీ మూసివేత

ముంబై:  ముంబైలోని ప్రముఖ బిస్కట్ల తయారీసంస్థ పార్లే  ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఓ ఫ్యాక్టరీ మూతపడింది. అది కూడా అక్కడిది, ఇక్కడిది కాదు.. పార్లే పేరుమీదే ముంబైలో ఉన్న ప్రముఖ జంక్షన్ విల‍్లెపార్లె ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ. ఇది 87 సంవత్సరాల నాటిది. విశేష ఆదరణ పొందిన ఈ ఫ్యాక్టరీ  గేట్లు  మూతపడ్డాయి. తక్కువ ఉత్పాదకత  కారణంగా ఫ్యాక్టరీని  మూసివేసిందని మిడ్-డే నివేదించింది.  గత కొన్నేళ్లుగా ఉత్పత్తిని నిలిపివేసిన సంస్థ  యజమానులు చివరకు దాని తలుపులు మూసేశారు. అయితే  ఈ ఒక్క ఫ్యాక్టరీ మూసివేతతో పార్లే బిస్కట్ల ఉత్పత్తి మొత్తం ఆగిపోదు. ఈ సంస్థకు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల‍్లో ఇంకా చాలా ఫ్యాక్టరీలున్నాయి. వాటి నుంచి పార్లే జీ బిస్కట్లు వస్తాయి. కేవలం ముంబై విలె పార్లె ప్రాంతంలో ఉన్న అత్యంత పాత ఫ్యాక్టరీ ఒక్కదాన్ని మాత్రమే పార్లే సంస్థ మూసేసింది.

కానీ ఈ వార్తతో ట్విట్టర్ సందేశాలు వెల్లువెత్తాయి. ముంబై లోకల్ రైల్లో ప్రయాణించే సమయంలో విలే పార్లే ప్రాంతంలే వచ్చే అద్భుతమైన  అరోమా పరిమళాలు ఇక లేనట్టేనా...  పార్లే ఫ్యాక్టరీ లేని విల్లే పార్లే లేదు.. మూసివేసింది ఫ్యాక్టరీనే కానీ.. ఉత్పత్తుల్ని కాదంటూ  భిన్న స్పందనలొచ్చాయి.

కాగా 1929లో విలే పార్లేలో ఈ ఐకానిక్ పార్లే కంపెనీ  తన ఉత్పత్తులను ప్రారంభించింది. శక్తినిచ్చే ప్రత్యేక గ్లూకోజ్ బిస్కట్లతో  అప్రతిహతంగా  దూసుకుపోయింది.  పిల్లలు, పెద్దలు, అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది.   క్రికెట్ రారాజు సునీల్  గవాస్కర్ ఇటీవల  67వ వసంతంలోకి అడుగుపెట్టిన తరుణంలో  పార్లే జీ గ్లూకోజ్ బిస్కెట్స్ అంటే గవాస్కర్ కు అత్యంత ఇష్టమని  ఆయన సోదరి నూతన్ గవాస్కర్  చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.  పార్లే  గ్లూకోజ్ బిస్కట్స్,  కుకీస్ అంటే ఒకపుడు  భారతదేశంలో అంతటి క్రేజ్  ఉండేది.

 

#Mumbai’s Vile Parle factory, which gave us ‘iconic’ #ParleG bicsuits, shuts down pic.twitter.com/aE56UMJz7U

మరిన్ని వార్తలు