అడ్డంగా దొరికేసిన ఇండిగో పైలట్

8 Mar, 2017 14:09 IST|Sakshi
అడ్డంగా దొరికేసిన ఇండిగో పైలట్

విమానాలు ఆలస్యం కావడం ఆరుదు. అలా లేటైనప్పుడు అందుకు కారణం ఏంటని ప్రయాణికులు గట్టిగానే నిలదీస్తారు. అలాగే ప్రయాణికులు నిలదీస్తుంటే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి ఇవ్వలేదని వంక చెప్పేందుకు ప్రయత్నించిన ఇండిగో విమాన పైలట్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఏటీసీ తప్పు ఏమీ లేకపోయినా.. దానిమీదకు తోసేయడంపై ఇండిగో విమానయాన సంస్థను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయొద్దని స్పష్టం చేసింది. దాంతో ఇండిగో సంస్థ తన పైలట్లందరికీ ఓ ఈమెయిల్ పంపింది. ఇలాంటి పనులకు పాల్పడొద్దని అందులో గట్టిగానే చెప్పింది.

చెన్నై నుంచి మదురై మార్గంలో వెళ్లాల్సిన 6ఇ-859 విమానం 11.45కి బయల్దేరాల్సి ఉండగా, దాన్ని 12.25కి రీషెడ్యూల్ చేశారు. ఆ విషయమై ప్రయాణికులకు ఎస్ఎంఎస్‌లు పంపారు. విమాన డిపార్చర్‌కు ఏటీసీ నుంచి అనుమతి రాలేదని పైలట్ తెలిపాడు. అయితే.. ప్రయాణికుల్లో ఒక ఏటీసీ అధికారి కూడా ఉన్న విషయం సదరు పైలట్‌కు తెలియదు. ఆయన వెంటనే చెన్నై ఏటీసీకి ఫోన్ చేసి విషయం ఏంటని అడిగారు. కానీ, వాళ్లు అసలు తమవైపు నుంచి సమస్య ఏమీ లేదని చెప్పడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. పైలట్ ఆ విషయం చెప్పే సమయానికి కాక్‌పిట్‌లో కో పైలట్ కూడా లేరు. ఆ తర్వాత తాను చెప్పిన అబద్ధానికి సదరు పైలట్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కో పైలట్ రాకపోవడం వల్లే విమానం ఆలస్యం అయ్యిందని తెలిపారు. అయితే.. తమ విమానం కేవలం మూడు నిమిషాలే ఆలస్యం అయ్యిందని ఇండిగో తెలిపింది.

మరిన్ని వార్తలు