పరిశ్రమలు పాతాళంలో..

13 Dec, 2013 02:45 IST|Sakshi
పరిశ్రమలు పాతాళంలో..

న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌లో అసలు వృద్ధి నమోదు కాలేదు. పైగా క్షీణత బాటలో మైనస్ (-) 1.8 శాతంలోకి జారిపోయింది. అంటే వార్షిక ప్రాతిపదికన చూస్తే సంబంధిత సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధి లేకపోగా, క్షీణించిందన్నమాట. వరుసగా రెండు నెలల క్షీణబాట వీడి జూలై నుంచీ వరుసగా మూడు నెలల పాటు 2012 ఇదే నెలతో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ కొద్దోగొప్పో వృద్ధి సాధిస్తూ వస్తోంది (జూలైలో 2.8 శాతం, ఆగస్టులో 0.4 శాతం, సెప్టెంబర్‌లో 2 శాతం). అయితే తిరిగి అక్టోబర్‌లో క్షీణతలోకి జారిపోయింది. గురువారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2012 అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి 8.4 శాతం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సైతం ఐఐపీలో అసలు వృద్ధి నమోదు కాలేదు. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 1.2 శాతం.
 
 కీలక రంగాలు ఇలా...
 తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం అక్టోబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 9.9 శాతం వృద్ధి నుంచి 2.0 క్షీణతలోకి జారిపోయింది.  ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సైతం 1.1 శాతం వృద్ధి నుంచి -0.3 శాతం క్షీణతలోకి జారింది. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూప్‌లలో 10 గ్రూపులు అక్టోబర్‌లో ప్రతికూలతను నమోదు చేసుకున్నాయి.
 మైనింగ్: ఐఐపీలో 14 శాతం వాటా కలిగిన ఈ రంగం క్షీణత మరింత పెరిగింది. ఇది -0.2 శాతం నుంచి -3.5 శాతానికి పడిపోయింది. 2013-14 మొదటి ఏడు నెలల కాలంలో ఈ రేటు -1 శాతం నుంచి -2.7 శాతానికి పడిపోయింది.
 
 విద్యుత్: విద్యుత్ రంగంలో వృద్ధి సైతం 5.5 శాతం నుంచి 1.3 శాతానికి పడిపోయింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య మాత్రం ఈ రేటు 4.7 శాతం నుంచి 5.3 శాతానికి ఎగసింది.
 
 క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌ను ప్రతిబింబించే ఈ రంగంలో వృద్ధిరేటు 7 శాతం నుంచి 2.3శాతానికి పడిపోయింది. ఏడు నెలల కాలంలో చూస్తే క్షీణత కొంత తగ్గడం కొంతలోకొంత ఊరట. ఈ కాలంలో ఈ రేటు -11.6 శాతం నుంచి -0.2 శాతానికి తగ్గింది.
 
 వినియోగ వస్తువులు: ఈ విభాగం అక్టోబర్‌లో అసలు వృద్ధిని నమోదుచేసుకోలేదు. గత ఏడాది ఇదే నెలలో వృద్ధి 13.8 శాతంకాగా, 2013 ఇదే నెలలో ఈ రేటు -5.1 శాతంగా ఉంది. ఇక ఏడు నెలల కాలంలో 4.2 శాతం వృద్ధి రేటు -1.8 శాతంలోకి జారిపోయింది. ఈ విభాగంలో భాగమైన కన్సూమర్ డ్యూరబుల్స్ మొత్తంగా కూడా  క్షీణతలోకి జారింది. 16.7 శాతం వృద్ధి నుంచి భారీగా 12 శాతం క్షీణతలోకి పడిపోయింది. ఏడు నెలల కాలంలో 5.7 శాతం వృద్ధి రేటు సైతం -11.2 క్షీణతలోకి జారిపోయింది.  ఇక ఈ విభాగంలో మరో భాగమైన నాన్-డ్యూరబుల్స్ విభాగం వృద్ధి 11.2 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోయింది. ఏడు నెలల కాలంలో ఈ రేటు వృద్ధి 2.8 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది.
 
 వడ్డీ రేట్లు తగ్గించాల్సిందే...: పారిశ్రామిక వర్గాలు
 అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. తయారీ రంగంసహా పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి రిజర్వ్ బ్యాంక్  కీలక వడ్డీ రేట్లను తగ్గించాల్సిందేనని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. వడ్డీరేట్ల కోత జరగనిదే సమీప భవిష్యత్తులో పారిశ్రామికోత్పత్తి మెరుగుదలను చూడలేమని ఆమె అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రస్తుత స్థాయికన్నా తక్కువకు పడబోదని, పారిశ్రామిక క్రియాశీలత తిరిగి మెరుగవుతుందని ఇటీవల నెలకొన్న ఆశలపై ఈ గణాంకాలు నీళ్లుజల్లాయని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే పటిష్ట, నిర్ణయాత్మకమైన పాలసీ నిర్ణయాలు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు