రికవరీ ఆశల పై నీళ్లు...!

13 Feb, 2014 01:19 IST|Sakshi
రికవరీ ఆశల పై నీళ్లు...!

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఆర్థిక రికవరీ ఆశలపై నీళ్లు చల్లాయి. 2013 డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు చూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా, క్షీణ దశ కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి 2012 డిసెంబర్‌లో -0.6 శాతం క్షీణత నమోదుకాగా, 2013 డిసెంబర్‌లో కూడా ఇదే ఫలితం వెలువడింది. క్షీణత యథాపూర్వం -0.6 శాతంగా నమోదయింది. అయితే కొంతలో కొంత ఊరట అనుకుంటే క్షీణత రేటు తగ్గడం. అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత -1.6 శాతం. నవంబర్‌లో -1.3 శాతం. తాజాగా ఇది మరింత తగ్గి - 0.6 శాతానికి చేరింది.

 ఐదు ప్రధాన రంగాల తీరు...
 మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం క్షీణత మరింత పెరిగింది. 2012 డిసెంబర్‌లో క్షీణత -0.8 శాతం. అదిప్పుడు ఏకంగా -1.6 శాతానికి చేరింది.

 మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో 14 శాతం వాటా ఉండే మైనింగ్ రంగం క్షీణత నుంచి బయటపడింది. ఈ రంగం -3.1 శాతం క్షీణత నుంచి 0.4 శాతం వృద్ధికి మళ్లింది.

 విద్యుత్ రంగం వృద్ధి రేటు కొంత సానుకూల రీతిలో 5.2 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది.

 మొత్తం వినియోగ వస్తువుల విభాగం క్షీణత మరింత పెరిగి -3.6 శాతం నుంచి -5.3 శాతానికి చేరింది. ఇందులో మన్నికైన వస్తువుల (డ్యూరబుల్) విభాగంలో సైతం క్షీణత మరింత పెరిగింది. -8.1 శాతం నుంచి -16.2 శాతానికి చేరింది. కన్సూమర్ నాన్-డ్యూరబుల్‌కు వస్తే ఈ విభాగం వృద్ధిబాటకు మళ్లింది. -0.5 శాతం క్షీణత నుంచి 1.6 శాతం వృద్ధిబాటకు మళ్లింది.

 ఇక డిమాండ్‌కు సూచిక అయిన భారీ వస్తువుల ఉత్పత్తి రంగం క్యాపిటల్ గూడ్స్ విభాగంలో క్షీణత మరింత పెరిగింది. -1.1 శాతం నుంచి -3 శాతానికి పడింది.

 9 నెలల్లోనూ క్షీణతే...
 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనూ (2013-14 మార్చి-డిసెంబర్) పారిశ్రామిక రంగం రివర్స్‌గేర్‌లోనే పయనించింది. ఉత్పాదకత క్షీణతలోనే నమోదైంది. 2012 ఏడాది ఇదే కాలంలో 0.7 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, ప్రస్తుతం అసలు వృద్ధిలేకపోగా -0.1 శాతానికి ఉత్పత్తి కుంగింది.
 
 వడ్డీ రేట్ల కోత తప్పనిసరి: పరిశ్రమలు
 తాజా గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పారిశ్రామిక రంగంలో వృద్ధికి ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే తయారీ రంగం పునరుత్తేజానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాయి.

ముఖ్యంగా తాము తయారీ రంగం తీరు పట్ల ఆందోళన చెందుతున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. పెట్టుబడులు, డిమాండ్ పెరగడానికి తగిన పరపతి విధానం అవసరమన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్న ధోరణి నేపథ్యంలో వడ్డీరేటు తగ్గించడానికి వెసులుబాటు ఉంటుందని విశ్లేషించారు. అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ కూడా దాదాపు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగం వ్యవస్థాగత అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లు పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు.

 తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, దీనిపై వ్యయాలు తీవ్రంగా ఉండడం, రుణ సమీకరణ వ్యయాల భారం వంటి అంశాలను ప్రస్తావించారు. కాగా ద్రవ్యోల్బణం-వృద్ధి మధ్య సమతౌల్యతను సాధించడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ... వృద్ధికి ఊతం ఇవ్వడానికి ఆర్‌బీఐ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిబార్ సింగ్ కోరారు.

మరిన్ని వార్తలు