ఇన్ఫోసిస్ అమెరికా వీసాల వివాదం పరిష్కారం

31 Oct, 2013 01:58 IST|Sakshi

 బెంగళూరు: వీసాల దుర్వినియోగం కేసును పరిష్కరించుకునే దిశగా 34 మిలియన్ డాలర్లు (రూ. 208 కోట్లు) అమెరికాకు చెల్లించనున్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. అయితే, తాము మోసానికి పాల్పడ్డామన్న అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేసింది. గతంలో వీసాలకు సంబంధించిన ఐ-9 పత్రాల విషయంలో కొన్ని తప్పిదాలున్న సంగతి గుర్తించి 2010-11 నుంచి వాటిని సరిచేయడం ప్రారంభించామని ఇన్ఫీ వివరించింది.
 
 అమెరికా న్యాయశాఖ విచారణ మొదలుకు ముందే తాము ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. తాము తీసుకున్న బీ-1 వీసాలు పూర్తిగా న్యాయబద్ధమైన వ్యాపార అవసరాలకే వినియోగించామని, హెచ్-1బీ వీసాలకు ప్రత్యామ్నాయంగా వాడుకోలేదని ఇన్ఫీ తెలిపింది. స్వల్పకాలికంగా ఉద్యోగులు వ్యాపారపరమైన సెమినార్లు వంటివాటిల్లో పాల్గొనేందుకు అమెరికా బీ-1 వీసాలను జారీ చేస్తుంది. అయితే, ఇన్ఫీ వీటిని వ్యాపారావసరాలకు వినియోగించుకుందని 2011లో అమెరికా అభియోగాలు  మోపింది. తాజాగా ఈ వివాదాన్నే ఇన్ఫీ పరిష్కరించుకుంది.
 

మరిన్ని వార్తలు