మళ్లీ బరితెగించిన పాకిస్థాన్‌!

24 Oct, 2016 11:13 IST|Sakshi
మళ్లీ బరితెగించిన పాకిస్థాన్‌!

జమ్మూ: సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్‌ మరోసారి బరితెగించింది. జమ్మూ ఆర్‌ఎస్‌ పుర సెక్టర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా భారీ కాల్పులు, మోర్టార్‌ షెల్లింగ్‌ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) జవాను ఒకరు మృతి చెందగా.. ముగ్గురు జవానుకు గాయాలయ్యాయి. పాక్‌ రేంజర్స్‌ కాల్పుల్లో గాయపడిన జవానును వెంటనే జమ్మూలోని ఆస్పత్రికి తరలించినా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మరో జవాను చికిత్స పొందుతున్నాడు.


ఆర్‌ఎస్‌ పుర సెక్టర్‌లో అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా ఆదివారం పాక్‌ రేంజర్లు రెండుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. మోర్టార్‌ షెల్స్‌ర, తక్కువస్థాయి ఆయుధాలతో కాల్పులకు దిగారు. దీంతో బీఎస్‌ఎఫ్‌ బలగాలు కూడా పాక్‌ రేంజర్ల కాల్పులకు దీటుగా బదులిచ్చారు.

ఇప్పటికే పాక్‌ సైన్యం కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను గుర్నామ్‌ సింగ్‌ మృతిచెందగా.. తాజా కాల్పుల్లో మరో జవాను ప్రాణాలు విడిచాడు. గత శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్‌ సెక్టర్‌లో పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను గుర్నామ్‌ సింగ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతీకారంగా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తీవ్రస్థాయిలో కాల్పులు జరిపి ఏడుగురు పాక్‌ రేంజర్లను హతమార్చారు. పాక్‌ ఏకపక్ష కాల్పుల్లో గాయపడిన గుర్నామ్‌ సింగ్‌ రెండురోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ను భారత సైన్యం ఆదివారం తీవ్రంగా హెచ్చరించింది. తమ సైనికులను కనీసం తాకాలని ప్రయత్నించినా పాక్‌ తీవ్ర మూల్యం చెల్లించుకోకతప్పదని తేల్చిచెప్పింది. పాక్‌ సైన్యం ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే.. దానిని దీటుగా ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉందని బీఎస్‌ఎఫ్‌ అడిషనల్‌ డీజీ అరుణ్‌ కుమార్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తలు