కరణంకు అలా.. రోజాకు ఇలా..

19 Dec, 2015 02:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఓ ఎమ్మెల్యేను శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేసినటువంటి ఘటన రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.  మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అధికారపక్షం ఆగమేఘాలపై సస్పెన్షన్ వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాల్‌మనీ అంశంపై సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడారన్న కారణంతో రోజాపై సస్పెన్షన్ వేటేసే తీర్మానం పెట్టించారు. సీఎం చంద్రబాబు గతంలో 2008లో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సస్పెన్షన్ వ్యవహారాన్ని ఉటంకించారు.

నాడు కరణం సస్పెన్షన్‌ను విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు రోజా విషయంలో దూకుడు చూపడం గమనార్హం. తీర్మానం పెట్టిన మరుక్షణమే ఎమ్మెల్యే రోజాకు ఎలాంటి వివరణ ఇచ్చుకునే అవకాశమివ్వకుండా సస్పెన్షన్ వేటేశారు. అంతేగాక ప్రతిపాదించిన రెండు నిమిషాల్లోనే సస్పెన్షన్ వేటేయడమేగాక అమలు పరిచారు. ఒకపార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించినట్లు బహిరంగంగా స్పష్టమైన సందర్భాల్లోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అనేక పద్ధతులు, సంప్రదాయాల్ని పాటిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా.. వారి వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించారు. సభ్యుల భావోద్వేగాల్ని పరిగణనలోకి తీసుకున్న సందర్భాలున్నాయి. నాడు కరణం విషయంలో ఈ సంప్రదాయాన్ని పాటించగా.. నేడు రోజా విషయంలో ఇవేవీ పాటించలేదు.

 బలరాంకు వివరణనిచ్చుకునే అవకాశం
 2008లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కించపరిచేలా మాట్లాడారు. తీవ్రమైన వ్యాఖ్యలతో స్పీకర్‌ను అగౌరవపరిచారు. దీనిపై అప్పట్లో అధికారపార్టీ సభ్యులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీన్ని అప్పటి స్పీకర్ సురేష్‌రెడ్డి సభాహక్కుల కమిటీకి నివేదించారు. సీనియర్ సభ్యుడు గాదె వెంకటరెడ్డి సారథ్యంలోని ఈ కమిటీ పూర్వాపరాలు తెలుసుకుంది. సాక్ష్యాధారాల్ని పరిశీలించింది. స్వయంగా కరణం బలరాం వాదనలు విన్నాకే ఆయన్ను ఆర్నెల్లపాటు సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది. అయితే ఈ సస్పెన్షన్‌పై అసెంబ్లీలో వివరణనిచ్చుకునే అవకాశాన్ని కరణంకు కల్పించింది. ఇప్పుడు రోజా విషయంలో ఇవేమీ లేకుండానే సస్పెన్షన్ వేటేశారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పందిస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అపహాస్యమైందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు