పేటిఎం ద్వారా బీమా ప్రీమియం చెల్లింపు

30 Oct, 2015 01:35 IST|Sakshi
పేటిఎం ద్వారా బీమా ప్రీమియం చెల్లింపు

4 సంస్థలతో ఒప్పందం

 ముంబై: ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం ప్రధాన బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. పాలసీదారులు ఆన్‌లైన్ ద్వారా ప్రీమియం చెల్లింపులు జరిపే సౌలభ్యం కల్పించేందుకు బీమా సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ సంస్థ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా రూ.1,000 కోట్ల ప్రీమియం చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఐసీఐసీఐ  ప్రుడెన్షియల్ లైఫ్, రెలిగేర్ హెల్త్, రిలయన్స్ లైఫ్, రిలయన్స్ జనరల్ సంస్థలతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొంది.

వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం 15 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోగలమని వివరించింది. వినియోగదారులు సులభంగా చెల్లింపులు జరిపేలా సేవలందించడమే తమ లక్ష్యమని పేటీఎం సీనియర్  వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి చెప్పారు. ఇక తమ 10 కోట్ల మంది నమోదిత యూజర్లు సులభంగా బీమా పాలసీల ప్రీమియమ్‌లు చెల్లించవచ్చని వివరించారు. అన్ని రకాల బిల్లు చెల్లింపులు, రీ చార్జ్‌లకు వన్ స్టాప్ షాప్‌గా పేటీఎంను తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. హోటల్ అగ్రిగేషన్ సేవలను కూడా అందించడం ప్రారంభించిన ఈ సంస్థకు ఇటీవలనే ఆర్‌బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లెసైన్స్ లభించింది.

మరిన్ని వార్తలు