'బీమా జాబితాలో జబ్బు లేదని.. రీయింబర్స్మెంట్ నిరాకరించొద్దు'

21 Sep, 2013 20:20 IST|Sakshi

వైద్య బీమా విషయంలో బీమా కంపెనీలు అనుసురిస్తున్న విధానంపై మద్రాస్ హైకోర్టు తలంటేసింది. బీమా జాబితాలో జబ్బు లేనంత మాత్రాన.. బీమా చేయించుకున్నవారికి చికిత్స ఖర్చులు నిరాకరించడానికి వీల్లేదని రూలింగ్ ఇచ్చింది. ఎవరైనా వ్యక్తికి తగిన వైద్య బీమా పాలసీ ఉండి.. వాళ్లు గుర్తింపు ఉన్న ఆస్పత్రిలోనే చికిత్స పొందినప్పుడు, వాళ్లకు ఖర్చులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించకూడదని జస్టిస్ టి.రాజా స్పష్టం చేశారు.

చెన్నై అన్నామంగళం ప్రాంతానికి చెందిన లిటిల్ ఫ్లవర్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో అసిస్టెంటుగా పనిచేస్తున్న జి.సైమన్ క్రిస్టూడస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. బీమా జాబితాలో ఆయనకున్న వ్యాధి కవర్ కాదన్న కారణంతో జిల్లా విద్యా శాఖాధికారి ఖర్చులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించినట్లు బాధితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కంటి నరాలపై ఒత్తిడి పెరగడం వల్ల చూపు తగ్గడంతో శస్త్రచికిత్స చేయించుకోగా దానికి 1.17 లక్షల రూపాయల ఖర్చయింది. కానీ ఆ వ్యాధి లేదన్న కారణంతో సైమన్ బిల్లులను చెల్లించేందుకు డీఈవో నిరాకరించారు. దీన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. 8 శాతం వడ్డీతో సహా బిల్లు మొత్తాన్ని సైమన్కు చెల్లించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు