రూ.100 కోట్లు అడిగితే 12 కోట్లిచ్చారు

7 Mar, 2016 02:30 IST|Sakshi
రూ.100 కోట్లు అడిగితే 12 కోట్లిచ్చారు

ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు అంటూ అరకొర నిధులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 20 నెలలు దాటిన తరువాత ఏపీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. రోడ్లపై చెట్ల నీడలో, దాబాలో కూర్చొని అంతర్రాష్ట్ర వాహనాలను ‘తనిఖీ’ చేస్తున్న తీరుపట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు చెక్‌పోస్టుల కోసం నిధులు కేటాయించింది. అయితే, ఈ 7 ‘ఇంటిగ్రేటెడ్’ చెక్‌పోస్టుల కోసం కేవలం రూ.12కోట్లు మాత్రమే విడుదల చేసింది. చెక్‌పోస్టుల నిర్మా ణం, నిఘా ఏర్పాట్ల కోసం తొలివిడత రూ.100 కోట్ల వరకు అవసరమని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు నివేదికలు పంపినప్పటికీ, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.

ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలపై నిఘా వేసేందుకు 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో కోదాడ, విష్ణుపురం, నాగార్జునసాగర్, ఖమ్మంలో పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో తుంగభద్ర నది బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఆయా సరిహద్దుల్లో ప్రభుత్వ స్థలాలేవీ లేనందున ప్రైవేటు భూములను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. భూసేకరణ చట్టం అమలు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, న్యాయపరమైన చిక్కుల్లేకుండా భూములు కొనుగోలు చేయడమొక్కటే మార్గమని అధికారులు భావించారు.

ఒక్కో చెక్‌పోస్టు వద్ద కనీసం నాలుగెకరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ధర విషయంలో అధికారులకు, భూ యజమానులకు పొంతన కుదరకపోవడంతో... బీఓటీ (నిర్మాణం, నిర్వహణ, అప్పగింత) విధానంలో లీజు పద్ధతిలో తీసుకోవాలని భావించారు. ఈ విధానానికి కొన్ని జిల్లాల్లో భూ యజమానులు ఒప్పుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, చెక్‌పోస్టులు నిర్మించాల్సి ఉంది. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ విధానంలోనే ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఈ లెక్కన చెక్‌పోస్టుల  వద్ద అధునాతన కెమెరాలు, స్కానర్లు, వేయింగ్ మిషన్లు, గోడౌన్, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో సాధార ణ రీతిన కూడా చెక్‌పోస్టుల నిర్మాణం సాధ్యం కాదని అధికారులే పెదవి విరుస్తున్నారు.
 
మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏవీ?
రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖకు ఏపీతో పా టు కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దులున్నాయి. కర్ణాటకతో చిరాగ్‌పల్లి, జహీరాబాద్ క్రాస్‌రోడ్స్‌లో చెక్‌పోస్టులు ఉండగా, మహారాష్ట్రతో బైంసా, వాంకిడి, మద్నూర్‌లలో ఉన్నాయి. ఇవికాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని బొరాజ్, నిజామాబాద్ జిల్లాలోని సాలూర చెక్‌పోస్టులు ప్రాధాన్యత గలవి. వీటిని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులుగా మార్చాలని సమైక్య రాష్టంలోనే ప్రణాళికలు తయారు చేసినా.. ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు.

>
మరిన్ని వార్తలు