సమీకృత అభివృద్ధికి ‘గ్రామజ్యోతి’

27 Jul, 2015 01:20 IST|Sakshi
సమీకృత అభివృద్ధికి ‘గ్రామజ్యోతి’

ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
 
గ్రామీణ ప్రాంతాల కోసం ప్రత్యేక కార్యక్రమం
గ్రామ స్థాయిలోనే అభివృద్ధి ప్రణాళికలు, అమలు
విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘం
వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
 
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సమీకృత అభివృద్ధి కోసం ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించనుంది. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామజ్యోతి ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి రూ.రెండు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు అభివృద్ధి నిధులను అందివ్వాలని సీఎం సంకల్పించారు.

పంచాయతీరాజ్ వ్యవస్థనుబలోపేతం చేయడం, గ్రామ పంచాయతీలను క్రియాశీలకంగా మార్చడం, గ్రామస్థాయిలోనే అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకొని అమలు చేయడం.. గ్రామ జ్యోతి కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత ్వం పేర్కొంటోంది. ఈ కార్యక్రమ విధి విధానాలను రూపొందించేందుకు పంచాయతీరాజ్ శాఖ  మంత్రి కె.తారకరామారావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సభ్యులుగా ఉంటారు. మంత్రివర్గ ఉపసంఘం వారంలోగా నివేదిక ఇవ్వాలని సీఎం నిర్ధేశించారు.

మన ఊరు-మన ప్రణాళికతో భూమిక
ప్రభుత్వం గతేడాది నిర్వహించిన మనఊరు-మన ప్రణాళిక గ్రామజ్యోతి కార్యక్రమానికి భూమిక కానుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పలానా గ్రామమే ప్రత్యేకం అనికాకుండా తెలంగాణలోని ప్రతి గ్రామం అవసరాలను తీర్చడమే ప్రభుత్వ సంకల్పంగా ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక మేరకు గ్రామజ్యోతి కార్యక్రమ విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఈ నెల 30న అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశం నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పంచాయతీరాజ్ శాఖ  ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు